హెచ్-1బీ వీసాల వినియోగంపై జేడీ వాన్స్ కు మైక్రోసాఫ్ట్ కౌంటర్…
‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పర్మ్)’ నుంచి సస్పెన్షన్ సందర్భంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ..ఘాటు విమర్శలు చేశారు. ఈ టెక్ సంస్థ అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిందని.. పర్మ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తోందని జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు.. విదేశీ ఉద్యోగులను, అమెరికన్ల స్థానంలో నియమించుకుంటూ వచ్చిందని ఆరోపణలు చేశారు.దీనిపై తాజాగా మైక్రోసాఫ్ట్ (Microsoft) స్పందించింది.
‘‘అమెరికా శ్రామిక శక్తి, ప్రతిభపై మాకు నమ్మకం ఉంది. అందుకే మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో అధిక శాతం అమెరికన్లే ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అదనపు సమచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ఆర్థిక సంవత్సరంలో మేం 6వేల హెచ్-1బీ వీసా (H-1B Visa) దరఖాస్తులను సమర్పించాం. వాటిలో 80 శాతం ప్రస్తుతమున్న ఉద్యోగుల విధుల్లో మార్పులు చేసేందుకు ఉద్దేశించినవే. కొత్తవారిని నియమించుకోవడం కోసం కాదు. మిగిలిన దరఖాస్తులేమో.. ఇప్పటికే చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ కంపెనీలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన వ్యక్తులవి. అమెరికా వర్క్‌ఫోర్స్‌తో పోలిస్తే వారు ఒక శాతం వరకే ఉన్నారు. వారు మనదేశానికి కొత్తగా వచ్చినవారు కాదు. ప్రభుత్వ నిబంధలకు అనుగుణంగా ఉన్న విదేశీ నిపుణుల కోసం మాత్రమే హెచ్-1బీ పిటిషన్లు దాఖలు చేస్తాం’’ అని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
మైక్రోసాఫ్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన జేడీవాన్స్ (J D Vance).. 2025లో ఆ సంస్థ ఆరు వేల మంది అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిందన్నారు. ‘‘ఆ తర్వాత 6,300 హెచ్-1బీ వీసాలను పొందింది. దాదాపు మూడు వేల గ్రీన్‌కార్డులను కూడా దక్కించుకుంది. ఈ లెక్కన చూస్తే- మైక్రోసాఫ్ట్ తొలగించిన ప్రతి ఒక్క అమెరికన్ ఉద్యోగి స్థానంలో.. సగటున ఒకటిన్నర విదేశీ ఒప్పంద పనివాళ్లతో భర్తీ చేసింది’’ అని వాన్స్ పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీల గురించి ఏదో ఒక చిన్న పత్రికలో ప్రకటన ఇచ్చి.. దానికి స్పందన రాలేదంటూ అమెరికన్ల స్థానంలో విదేశీ ఒప్పంద పనివాళ్లకు మైక్రోసాఫ్ట్ అవకాశమిస్తోందని వాన్స్ ఆరోపించారు.








