నోబెల్ శాంతి బహుమతి 2026 విజేత నవనీతం ‘నవీ’ పిళ్లే’
అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కులే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న భారత సంతతి న్యాయమూర్తి నవనీతం ‘నవీ’ పిళ్లేను 2026 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, జాతి నిర్మూలన వంటి తీవ్రమైన అంశాలపై నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. అసాధారణమైన ధైర్యం, నైతిక నిబద్ధతతో ప్రపంచ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్రను కమిటీ కొనియాడింది.
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో వర్ణవివక్ష పాలనలో మగ్గుతున్న ఒక భారత తమిళ మూలాలు ఉన్న కుటుంబంలో నవీ పిళ్లే జన్మించారు. సమాజంలో పాతుకుపోయిన తీవ్రమైన వివక్ష, వేర్పాటువాదాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన నెల్సన్ మండేలా వంటి ఎందరో ఉద్యమకారులకు ఆమె న్యాయవాదిగా అండగా నిలిచారు.
తన సుదీర్ఘ కెరీర్లో ఆమె దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ (ICTR), అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) న్యాయమూర్తిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గానూ సేవలందించారు. ఇటీవల వరకు ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై యూఎన్ ఏర్పాటు చేసిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించారు. ప్రస్తుతం ఆమె మయన్మార్‌పై నమోదైన జాతి నిర్మూలన కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రువాండా ట్రైబ్యునల్‌లో నవీ పిళ్లే పాత్ర చరిత్రాత్మకమైనది. అత్యాచారం, లైంగిక హింసను కేవలం సాధారణ నేరాలుగా కాకుండా, మానవత్వానికి వ్యతిరేక నేరాలుగా, జాతి నిర్మూలన చర్యగా పరిగణించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. .
నవీ పిళ్లే వంటి ధైర్యవంతులు దేశాలను, నాయకులను జవాబుదారీగా నిలబెడుతూ, హింస బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారని ప్రశంసించింది. ఆమె నిబద్ధత, స్వాతంత్ర్యం, అపారమైన అనుభవం ఆమెను మన కాలంలోని అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ న్యాయవేత్తలలో ఒకరిగా నిలబెట్టాయని కమిటీ పేర్కొంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడింది.








