మస్క్ మామూలోడు కాదు…ఇళ్లు అమ్మేవాళ్లను ఓ రేంజిలో ఇరికించేస్తున్నాడు!!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
AI డేటా సెంటర్ శబ్దం భరించలేక ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న స్థానికులు.. ఇదే అదనుగా 418 ఇళ్లను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన మస్క్ కంపెనీ! అయితే ఇల్లు అమ్మాలంటే ఒక షరతుకు ఒప్పుకోవాలట. అదేంటంటే…!
ఒకప్పుడు ఇల్లు కొనాలంటే చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఉందా? రోడ్లు ఎలా ఉన్నాయి? కాలుష్యం ఎంత? అనే విషయాలు చూసేవారు. కానీ ఇప్పుడు అమెరికాలోని మిసిసిపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఇల్లు అమ్ముకోవాలంటే ప్రశాంతత గురించి కాదు.. కోర్టులో కేసు వేయకూడదనే ఒప్పందం గురించి చర్చ జరుగుతోంది. దీనంతటికీ కారణం ఎలాన్ మస్క్‌కు చెందిన AI డేటా సెంటర్! కృత్రిమ మేధస్సు కోసం వేలాది GPUలతో పనిచేస్తున్న ఈ కేంద్రం చుట్టుపక్కల ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగులుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు ఏకంగా 418 ఇళ్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. అయితే ఈ డీల్ వెనుక ఉన్న అసలు మెలికే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
418 ఇళ్లపై మస్క్ కంపెనీ కన్ను.. ఎందుకీ భారీ కొనుగోళ్లు?
అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రం సౌత్హేవెన్లో ఉన్న కొలొసస్ (Colossus) AI డేటా సెంటర్ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఎలాన్ మస్క్‌కు చెందిన SpaceX, xAI సంస్థల కార్యకలాపాలకు ఈ కేంద్రం కీలకంగా ఉంది. ఆయన Grok AIకి అవసరమైన భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించేందుకు ఇక్కడ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.
ఈ కేంద్రానికి సమీపంలోని కలోనియల్ హిల్స్ ప్రాంతంలో మొత్తం 418 ఇళ్లను కొనుగోలు చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. డేటా సెంటర్‌కు విద్యుత్ అందించే పవర్ ప్లాంట్‌కు ఈ ఇళ్ల ప్రాంతం సుమారు అర మైలు దూరంలో ఉంటుంది.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నేరుగా ఇళ్ల యజమానుల దగ్గరకు వెళ్లి కొనుగోలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఇళ్లను కొనుగోలు చేయడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. డేటా సెంటర్ విస్తరణకు అవసరమైన ఉద్యోగులకు నివాసాలు కల్పించడం. రెండోది.. కంపెనీ కార్యకలాపాలపై స్థానికంగా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడం. సౌత్హేవెన్ మేయర్ డారెన్ ముసెల్వైట్ కూడా ఈ ఇళ్లను SpaceX, xAI ఉద్యోగుల నివాస అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
ఇల్లు అమ్మాలంటే ఆ ఒక్క ఒప్పందానికి ఒప్పుకోవాల్సిందేనా?
ఈ వ్యవహారంలో అసలు ఆసక్తికరమైన అంశం ఇళ్ల కొనుగోలు ధర కాదు.. అమ్మకందారుల ముందు పెడుతున్న షరతు! ఇల్లు అమ్ముకునే వారు డేటా సెంటర్ నుంచి వెలువడుతున్న శబ్ద కాలుష్యంపై కంపెనీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న క్లాస్ యాక్షన్ దావాలో చేరకూడదనే నిబంధనకు అంగీకరించాలి.
అంటే, తమ ఇళ్ల చుట్టూ శబ్ద కాలుష్యం ఉందని ఇప్పటికే కోర్టు వరకు వెళ్లిన స్థానికులు.. ఇప్పుడు కంపెనీకి ఇల్లు అమ్ముకోవాలంటే అదే సమస్యపై న్యాయపోరాటంలో పాల్గొనే హక్కును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నమాట.
ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ప్రజలకు ఇళ్లకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయడం వ్యాపార ఒప్పందమే కావచ్చు. కానీ మరోవైపు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టపరంగా ప్రశ్నించే అవకాశాన్ని కూడా ఈ ఒప్పందం ప్రభావితం చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విమానాశ్రయం దగ్గర ఉన్నట్లుగా శబ్దాలు.. స్థానికులకు నరకం!
కొలొసస్ I, కొలొసస్ II డేటా సెంటర్లు ప్రారంభమైనప్పటి నుంచి స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు ఉపయోగిస్తున్న గ్యాస్ టర్బైన్లే వివాదానికి కారణమయ్యాయి.
భారీ GPUలు నిరంతరం పనిచేయాలంటే విపరీతమైన విద్యుత్ అవసరం. అందుకోసం ఏర్పాటు చేసిన గ్యాస్ టర్బైన్ల నుంచి వస్తున్న శబ్దం చుట్టుపక్కల ఇళ్లకు చేరుతోందని స్థానికులు చెబుతున్నారు.
కొంతమంది నివాసితులు చెబుతున్న వివరాల ప్రకారం.. రాత్రిపూట కూడా ఆగకుండా వినిపించే హైపిచ్ శబ్దాలు, విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు వచ్చే శబ్దాలను పోలిన ధ్వనులు వారి జీవనశైలిని దెబ్బతీస్తున్నాయి. టర్బైన్ల నిరంతర గిరగిర శబ్దం వల్ల ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, అనుమతులు లేని టర్బైన్ల వినియోగం, వాటి నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంపై కూడా గతంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అనుమతులు లేని టర్బైన్లన్నింటినీ ఏడాదిలోగా తొలగిస్తామని SpaceX, xAI హామీ ఇచ్చాయి. తమ 1.2 గిగావాట్ల విద్యుత్ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపాయి.
అయితే టర్బైన్లను తొలగించడం లేదా విద్యుత్ సరఫరా వ్యవస్థను మార్చడం వల్ల శబ్ద కాలుష్యం సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందా? అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
మా తప్పేమీ లేదు.. శబ్దం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం!
స్థానికుల ఆరోపణలను కంపెనీ అంగీకరించడం లేదు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సర్దుబాటు చేశామని, శబ్దం బయటకు వెళ్లకుండా సౌండ్ డ్యాంపెనింగ్ గోడలను ఏర్పాటు చేశామని చెబుతోంది.
అయితే ఈ చర్యలతో అందరికీ ఉపశమనం లభించలేదని కొందరు నివాసితుల ఫిర్యాదులు సూచిస్తున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు మాత్రం ఈ డేటా సెంటర్ల రాకతో తమ కార్యకలాపాలు పెరిగాయని చెబుతున్నాయి. అంటే ఒకే ప్రాజెక్టు కొందరికి ఆర్థిక అవకాశాలు కల్పిస్తుంటే, మరికొందరికి జీవన సమస్యలు సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు స్థానికులు తమ ఇళ్లను అమ్ముకుని ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు.
మస్క్ కూడా అక్కడే మకాం.. Grok కోసం భారీ ప్లాన్!
ఈ డేటా సెంటర్ విస్తరణపై ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆయన వారానికి నాలుగు రాత్రులు అక్కడే Airstream ట్రైలర్లో ఉంటున్నట్లు సమాచారం. Grok AIకి మరింత కంప్యూటింగ్ శక్తి అందించాలంటే భారీ డేటా సెంటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, విస్తృతమైన మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే మిసిసిపీలో కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.








