కథ 3: రామూర్తి పెళ్ళయింది (హాస్య కథ) – రావి కొండలరావు
Ravi Kondala Rao Hasya Kathalu – Part3
బస్సుకోసం పడిగాపులు కాస్తూ ఫర్లాంగున్నర పై చిలుకున నించున్న క్యూలో చిట్టచివరి వచ్చి చేరిన వసంత, కొంతసేపటికి మధ్యకొచ్చి – వెనకు తిరిగి చూసుకుని “పూర్వకాలం” నాటి తన స్థానాన్ని తలుచుకుని, తను ఎంత ముందు కొచ్చిందో వూహించుకుని, “ఓయబ్బో” అని నిట్టూర్చి ముందు నడక సాగించింది. ఈలోపల వచ్చే బస్సులు వస్తున్నాయి – అట్లాగే పోతున్నాయి. ఎక్కుతున్న వాళ్లు ఎక్కుతున్నారు – మిగతావాళ్లు క్యూలోపడి కొట్టుకుంటున్నారు. వసంత వెనక్కు తిరిగి చూసుకోవడంలో, ఆరు శాల్తీలకు వెనకుపున్న తాజా యువకరత్నం ఒకడు, తనకోసమే కాబోలు ఆ చూపు అనుకుని, ముద్దుగా కాలరు నిమురుకున్నాడు.
క్యూలోని జనాలలో కొందరు అక్కడే కూలబడుతున్నారు. మరికొందరు కాళ్ళు నొక్కుకుంటున్నారు. ఒకయన ఆ క్యూలో నించునే, శరత్‌బాబు పెద్ద నవల పూర్తిచేసి, పుస్తకం మడిచి, మరో పుస్తకం వుంటే బాగుండును అని తలపోశాడు. ఒకడు, లెక్కవేసుకున్న ప్రకారం ఇరవై నాలుగు సిగరెట్లు కాల్చాడట. కొందరు స్టూడెంట్ట్లు, క్యూలో నడుస్తూనే పాఠాలు కంఠతా పడుతున్నారు. వసంత ఇవేమీ చెయ్యకుండా అటూ ఇటూ వున్న పరిసరాలను మాత్రం చూడసాగింది. “ఈ పక్క మేడ ఎంతసేపని చూడను?” అని విసుక్కున్నది కూడా. ఆమెకు ఆరుగురి వెనక వున్న ఆ యౌవనుడు, ఆమె వెనకు వచ్చి చేరాలని మహా ఉవ్విళ్ళూరిపోతున్నాడు.
బస్సుల రాకడా, అసువుల పోకడా తెలియనవి పెద్దలంటారు. అందువల్ల పెద్దల వాక్కును జవదాటని ఇంకో బస్సు – ఎట్టకేలకు తెలియకుండా, ఛట్తున వచ్చి నించుంది. సాగుతున్న చీమలబారు దగ్గర, కాస్త వూదితే, బారు చెదిరి అటూ ఇటూ పోయినట్లుగా – బస్సు ఆగగానే ఈ “బారు” కూడా చిందరవందరై తోపులాటలూ, అడావుడులతో బస్సు ద్వారం ముందు ముద్దుగా మూగింది. ఆ ముద్దంతా మగ ముద్ద. ముగ్దలంతా వెనకు- వుండిపోయారు. ఒకడినో, అరనో సేకరించుకుని – మిగతావాళ్లను వాళ్ళ ఖర్మకు వదిలి – మంత్రిగారి బావమరదళ్లే పొజిచ్చి – బస్సు సాగిపోయింది. మళ్ళీ క్యూ-క్యూలో వసంత. ఇందాక ఆరుగురి వెనక కాలరు నిమురుతూ నించున్న కుర్రాడు ఈసారి ఆమె వెనకగా – తయారయినాడు.
“ఇట్లా ఐతే ఎట్లా?” అన్నది వసంత లోలో. తను మగవారిలాగానే ముందుంజ వెయ్యాలి. దేశ నాయకులూ పెద్దలూ సమాన హక్కులంటున్నారు. ఆ కండక్టరేదో కాటుకా బొట్టూ పెట్టి తనను ఆహ్వానిస్తాడని తను కూచుంటే – అదే నించుంటే – అయ్యే పనికాదు. తను కూడా సాహసం ప్రదర్శించాలి. వసంతను వెంబడిస్తున్న యువకరత్నం ఆమె జడలోని పూవులను పబ్లిగ్గా వాసన చూడబోయి, టక్కున తగ్గాడు. వసంత ఇవేమీ పట్టించుకోలేదు. ఆమె ధ్యానం అంతా అప్పుడు బస్సుమీదే వుంది.
కొంతకాలానికి మరో బస్సు వచ్చింది. వసంత తెగించింది. మగవారినందర్నీ ఛేదించుకొంటూ, మగతనం ప్రదర్శిస్తూ జబర్దస్తీగా బస్సులో జొరబడింది. “లేకపోతేటా–“ అనుకుంది నిట్టూరుస్తూ. ఆడది కూడా మగడిగా తయారైతేనే కాని మగాళ్ళు లొంగరు, అని సిద్ధాంతీకరించుకున్నది. స్టాపులోంచి బస్సు కదిలిపోయింది. వసంత వెనకాలేవుండి, స్వప్నసీమలో విహరిస్తున్న ఆ హీరో ట్రాజెడీలో పడి, “నన్నాక్కణ్మి– నేనాక్క… ణ్ణి” అని బస్సుతో మొరపెట్టుకున్నాడు. ఆ మొరను కాస్తకూడా ఖాతరు చేయకుండా ఆ శకటం ముందు బుర్రుమని, ఆ వెంటనే తుర్రుమంది. వసంతకు బస్సులో నించోటానికి కూడా స్థలం కరువైంది. ఏదో విధంగా సర్దుకుని, నించుంది. ఆమె నించున్న ప్రక్కనే సీటులో కూచుని వున్న ఒక రామూర్తి – ‘’స్త్రీలను గౌరవించవలెను” అనే పెద్దల వాక్యాన్ని స్మరణకు తెచ్చుకుని – లేచి, ఆమెను కూచోమన్నాడు.
‘’థాంక్స్” అన్నదామె – కూచోకుండానే.
‘’ప్లీజ్ సిడపున” అన్నాడు రామూర్తి ఆంగ్లంలో మరింత మర్యాదగా, ఆమెను చూసి.
ఈసారి ఆమె, రామూర్తి ముఖాన్ని చూస్తూనే సీటులో కూలబడింది. ఆమె పెదవులు “థాంక్స” అన్నట్లుగా కదిలాయి. వసంత వీక్షణాలు రామూర్తి మీద పడ్డాయి. “ఎంత మంచి హృదయం! మగాళ్లలా కాదు. అసలు మగాళ్ల పోలికలే లేవు పాపం! ఎంత ఆదరణ, ఎంత గౌరవం” అనుకున్నది వసంత రామూర్తిని మెచ్చుకుంటూ. కాసేపటికి ఆమె – రామూర్తి అందాన్ని కూడా మెచ్చుకుంటూ – “ఎంత బావున్నాడు” అనుకుంది. ఐతే వసంత గురించి రామూర్తి ఏ అభిప్రాయమూ వెలిబుచ్చుకోలేదు. అతని దృష్టి ఇంకెక్కడో ఉంది. సీటు పక్కగా నించున్న రామూర్తికి తగిలేట్లుగా వసంత చెయ్యి విసిరింది. బస్సు రుల్లుమన్నది. “ఎంత మంచి ఝల్లు” అనుకుంది పరవశంతో. “తొలిచూపులోనే ఇతన్ని నేను వలచాను” అన్నది వసంత స్వగతాన.
కొంతసేపటికి రామూర్తి బస్సు దిగే ప్రయత్నం చేశాడు. వసంత చట్తున కళ్లు తెరిచి చూడగా – తాను దిగాల్సిన స్టాపుకు మూడు స్టాపులు ముందుకొచ్చింది. “అరెరే” అనుకుని, తొందరగా ఆమె కూడా అతని వెనకలే బస్సు దిగింది. బస్సు వెళ్ళిపోగానే తలవొంచుకుని వెళ్ళిపోతున్న రామూర్తిని చూసి – “ఇదిగో చూడండి” అన్నది వసంత.
రామూర్తి చూశాడు.
“మీ ఉపకారానికి చాలా కృతజ్ఞతలు అండీ” అన్నదామె.
“దేనికి?… ఓహో… ఆఁ…అదా..దానికేం…” అని రామూర్తి పోబోయాడు.
“చూడండి” అంది వసంత మళ్లి.
ఈసారి రామూర్తికి కోపం వచ్చింది. “ఏమిటది చెబుతూ ఉంటే – మీ వేషాలు నా దగ్గర సాగవు” అన్నాడు గట్టిగా.
“నేనేం వేషం వేశానండి” అంది భయంతో.
“నాకు తెలుసు. ఇట్లా నా వెంటబడి,. నన్ను వలలో వేసుకోవాలని మీ ప్రయత్నం. ఇక్కడవేం సాగవు..జాగ్రత్త. ఇంకా వెంటాడారంటే, మా నాన్నగారితో చెప్పి …”
“ కోపించకండి. మీకు చాలా కష్టం కలిగించాను. మీకు అభ్యంతరం లేకపోతే , మీ పేరు చెబుతారూ?”
“రామూర్తి!” అన్నాడు రామూర్తి కోపంగా, కుండ బద్దలు కొట్టినట్లు.
“రామూర్తి! ఎంత చక్కని పేరు… మరి మీ ఇల్లు…”
ఈసారి రామూర్తి మండిపోయాడు. “చెబుతూంటే వినిపించుకోకుండా నడివీధిలో ఈ అల్లరేమిటి, వెళ్లండి…అదే మా ఇల్లు” అని చరచరా వెళ్లి ఇంట్లో దూరి, రామ్మూర్తి తలుపు గడియ వేసేశాడు. ఆ తలుపులు కేసి చూస్తూ వసంత పదిసార్లు కనురెప్పలు విదిలించి, తీయని బాధతో నిట్టూర్చింది.
“నువ్వు ఇంకా భోజనానికి రావా వసంతా” అని పలకరించింది ఆమె హాస్టల్ రూమ్ మేటు సరళ. వసంత సమాధానం చెప్పలేదు. పక్కమీద శయనించి దిండు కింద తలదూర్చుకుని బొమ్మల్లే పడివున్నది.
“ఏం వసంతా – ఏమిటిది?” అన్నది సరళ మళ్ళీ.
వసంత వినిపించుకోలేదు – కదలలేదు, మెదలలేదు.
సరళకు ముచ్చెమటలూ పోశాయి. “ఆడపిల్లల హాస్టల్లో విద్యార్థిని దుర్మరణం – హత్యో, ఆత్మహత్యో తేలక పోలీసులు మథనపడ్డ వైనం?” అని న్యూసు హెడ్డింగు ఊహించుకున్నది. సరళకు ఇంక కాళ్ళు స్వాధీనంలో లేవు. “ఓ విమలా, కమలా, మృణాళినీ… సత్యభామా…” అంటూ ఎలుగెత్తి అరవసాగింది – అరణ్య మధ్యంలోని ఆర్తనాదంలా.
ఈ దెబ్బకుగాని వసంత మేలుకోలేదు. ఆమె ఛట్టున లేచి కూచుని, “ఏమిటా గావుకేకలు?” అని అరిచింది.
“అమ్మయ్య – నువ్వు బ్రతికే వున్నావా – గుండె అదిరిపోయింది. అందుకని…”
“అట్లా కాకిలా అరిచావు”
ఇంతలో ఇందాకటి నామధేయాలన్నీ వరసక్రమంలో అక్కడికి పరుగెత్తాయి. “ఏమిటే… ఏమిటి… ఏం జరిగింది?…” అంటూ.
“ఏమీ లేదు మీరంతా వెళ్ళిండి. ఈ సరళ వట్టి దొంగ రాస్కెల” అన్నది వసంత కూచుంటూ.
“అసలు జరిగిందేమిటి వసంతా?” అని అడిగింది సత్యభామ.
“నథింగ్, మీరంతా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళరేం?”
వసంతకు పిచ్చో పిశాచమో పట్టిందని ఆ భామలంతా బయటకు పరుగెత్తారు. వసంత తలుపు గడియ వేసేసింది.
“అయ్యో – నేనుండిపోయాను. నన్ను కూడా పోనీ” అన్నది సరళ భయంగా.
“నువ్వుండు సరళా… సరళా! నాకు నువ్వు ఒక మహోపకారం చెయ్యాలి… ఇలా కూచో… సరసన కూచో… నా హృదయ స్పందనం నీకు వినిపిస్తోందా? వినిపించదు. అసలు, హృదయం అక్కడుంటేగా – అదెప్పుడో తస్కరించబడ్డది. ఆ యువకుడెవరో… ఏమిటో… ఆ నల్లని కురులు… తెల్లని పలువరుస… చల్లని చూపులు… మెల్లని నడకా…”
“ఐసీ! ఇదన్నమాట నీ పిచ్చి! ఇంతకూ ఎవరా నాయక శిఖామణి? నాతో చెప్పు – చెయ్యగలిగిందేమన్నా వుంటే చేస్తాను”
“హు! నీవల్ల కాదు. ఐనా నువ్వు చెయ్యగలవనే ధైర్యం నాకుంది. ఎట్లాగైనా సరళా! నువ్వు నన్ను కాపాడాలి.”
“ఇంతకూ ఆ హీరో ఎవరంటే?”
“ఆయన పేరు… పేరు… అబ్బా చెప్పలేను”
“సరే, నే వెళ్ళే. పిచ్చాసుపత్రిలో బెడ్ రిజర్వు చెయ్యాలి”
“ఆ ఆ… పుండండీ. ఆయన పేరు రామ్మూర్తి!” అని చట్టున చెప్పింది వసంత – ఆకాశమంత సిగ్గుపడుతూ.
“ఐతే ఆయనా నువ్వు ప్రేమించుకుని ఎన్నాళ్ళయింది?”
“ఎన్నాళ్ళో! ఇంత ఇంకా ఇన్నాళ్ళు జీవించి పుండేదాన్నా? ఈరోజే”
“తాజా ప్రేమా! అందుకే వేడి ఎక్కినట్టుగా వుంది” అని తన ధోరణిలో సరళ జోక్ చేసింది.
ఆ తర్వాత వసంత సరళను పక్కన కూచోబెట్టుకుని, చాలా తియ్యని కబుర్లు చెప్పింది. రామ్మూర్తి, తనూ ఎక్కడ కలుసుకున్నారో – అతని మాటల ధోరణి – అతని ఇల్లూ ఇవన్నీ చెప్పింది. “నీ ప్రాణం పోయినా సరే, నా ప్రాణం కాపాడాలి” అని కూడా చెప్పింది. చేతనైనంత సహాయం చేస్తాను – ముందు భోజనానికి లెమ్మది సరళ.
సరళ రామ్మూర్తి ఇంటిముందు నిలిచి “ఇది రామ్మూర్తి ఇల్లేనా?” అని అడిగింది గట్టిగా. ఎవరూ సమాధానం చెప్పలేదు. అదే ముక్కు మళ్ళీ అంది – మరింత గట్టిగా. ఓ యువకుడు వచ్చాడు – అమ్మాయి తమ ఇంటిముందేమిటని ఆలోచిస్తూ.
“నమస్కారం రామ్మూర్తిగారూ! నేను మీతో పనివుండి వచ్చాను” అన్నది సరళ.
“నేను రామ్మూర్తిని కాను. లక్ష్మణరావును. మీ పనేమిటో నాతో చెప్పండి” అన్నాడు యువకుడు సరళవైపు ఓరగా చూస్తూ.
“రామ్మూర్తిగారు లేరా?”
“వస్తారు. మీరిలా వచ్చి కూచోండి” అని లక్ష్మణరావు సరళను లోపలకు ఆహ్వానించాడు. సరళ పెద్దచిక్కులో పడింది. తనేమో, వసంత ప్రేమ వ్యవహారంలో రామ్మూర్తి కోసం వస్తే – మధ్య ఈ లక్ష్మణరావెవడో తనమీద దృష్టి సారిస్తున్నాడు. ఈ ప్రేమలు ఇట్లాగే ప్రారంభమవుతాయి. వీటికి అర్థం లేదు, అని విసుక్కుంది. తనమీద ప్రేమతో ఈ లక్ష్మణరావు కూడా ఎవర్నయినా తన దగ్గరకు పంపుతాడా – తనను వసంత పంపినట్టు! “రామ్మూర్తితో మీకు ఏపాటి పరిచయం?… మీ విషయం ఎప్పుడూ వాడు నా దగ్గర ప్రస్తావించలేదే! ఐనా, పైకి నంగిలా నటిస్తాడు గాని – వెధవ అసాధ్యుడు లెండి. అంటే – ఈ విషయంవల్ల తేలుతోంది. మీ పేరు?… పోనీలెండి. “పేరులో ఏముంది? నేను రామ్మూర్తి కజిన్‌ను. వాడి తండ్రి, మా నాన్నా పెద్ద తండ్రి పింతండ్రి పిల్లలు. నాకన్నీ మా నాన్న పోలికలొచ్చాయి. ఆయన మహ గట్టివాడు…” ఈ ధోరణిలో ఆ కుర్రాడు ఉపన్యాసం దంచుకుంటూ పోసాగాడు. సరళ దేనికీ సమాధానం ఇవ్వలేదు. ఆమె రామ్మూర్తి కోసం నిరీక్షించసాగింది.
కాస్సేపటికి రామ్మూర్తి వచ్చాడు. అతన్ని చూడగానే లక్ష్మణరావు తగ్గాడు. ఐతే రామ్మూర్తి సరళను గానీ, సరళ రామ్మూర్తిగాని పలకరించుకోక పోవడం వల్ల – అతనే కలిగించుకుని “ఇతనే రామ్మూర్తి” అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ.
సరళ లేచి నమస్కరించింది.
“ఎవరికోసం?” అన్నాడు రామ్మూర్తి లక్ష్మణరావుకి చూసి.
“నీకోసమే రాజా! ఆడపిల్ల వెతుక్కుంటూ వచ్చి అడిగితే, నివ్వెరపోతావేంరా నంగీ – నీకోసమే!”
“నాకోసమా! వీళ్ళేదు. నిన్న వో అమ్మాయి. ఇవాళో అమ్మాయి. అంతా రౌడీ మూక – దయచేసి మీరు చెప్పండి” అని రామ్మూర్తి ఛర్రున లోపలకు పోయాడు.
సరళ రెండు మూడుసార్లు పిలిచిందిగాని రామ్మూర్తి పలకలేదు. చివరకు లక్ష్మణరావును చూసి – “మీరో పని చేస్తారు?” అని అడిగింది నెమ్మదిగా.
“ఒక పనా! ఏం చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధంగా వున్నాను. స్వప్న సముద్రాలూ ఔపోసిన పట్టుమంటారా – భూమిని, పర్వతాలనూ వేరు చెయ్యమంటారా?” అన్నాడు లక్ష్మణరావు ధాటిగా నించుని.
“భూమిని పర్వతాలనూ వేరు చెయ్యండి” అన్నది సరళ సీరియస్‌గా. లక్ష్మణరావు మళ్ళీ మాట్లాడలేదు. నవ్వదామనుకుంటే అదీ పలకలేదు. ఎట్లా లేచాడో అట్లాడే చతికిల పడ్డాడు.
“ఏమీ అఖ్కర్లేదు – మీరు రామ్మూర్తిగారిని పిలిస్తే చాలు” అంది సరళ.
“ఇంతేనా?” అని లక్ష్మణరావు లోపలకు వెళ్ళి – ఇరవై నిమిషాల తర్వాత రామ్మూర్తిని లాక్కువచ్చాడు.
“ఇదిగో చూడండి. నాపేరు సరళ. నిన్ను మీతో మాట్లాడిన అమ్మాయి పేరు వసంత. వసంత మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తోంది. మీరు లేకపోతే బ్రతకలేదు. ఇదిగో ఉత్తరం. దీనికి సమాధానం పంపండి. లేదూ, ఒక నిండు ప్రాణిని హత్యచేసిన వారవుతారు.” అని తెచ్చిన ఉత్తరం అక్కడ పడేసి – సరళ చరచరా బయటకు నడిచింది. “సరళ” అంటూ లక్ష్మణరావు ఆమె వెంటపడ్డాడు.
రామ్మూర్తి వసంత రాసిన ఉత్తరం చదివాడు. అందులో నానా కవిత్వమూ ఉంది. మామూలు ప్రణయ భాష అంతా ఉపయోగించింది. ఆ ఉత్తరం చదివిన వెంటనే రామ్మూర్తి కొద్దిగా మెత్తబడటం కనిపించినా, అంతలోనే మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు. “ఈ ఉత్తరాన్ని మా నాన్నకు చూపిస్తాను” అనుకున్నాడు – గట్టిగానే. ఈ మాట రామ్మూర్తి తండ్రి విన్నాడు కూడా. ఆయన అప్పుడే లోపలకు వచ్చి, “ఏ ఉత్తరం రా?” అని అడిగాడు.
“ఈ పుస్తకం. ఎవరో వసంతట. కాలేజీ పిల్ల. నన్ను ప్రేమిస్తోంది. పళ్ళు రాళ్ళగొట్టించు నాన్న” అని రామ్మూర్తి ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఉత్తరం అంతా చదివి – “గట్టి ఉత్తరమే. మరి నువ్వేం రాశావు?” అని అడిగాడు.
“నేను రాయడమేమిటి నాన్న – నువ్వెంటనే వెళ్ళి – ఆ పిల్లను కలుసుకుని – ఈ వ్యవహారాలు కట్టిపెట్టమని, జాగ్రత్తగా ఉండమని తిట్టిరా. అవసరమైతే ఆ పిల్ల తండ్రికి ఉత్తరం రాయి” అన్నాడు రామ్మూర్తి.
“నాయనా రాముడా! నువ్వు లోకం ఎరుగుదువుగాని – ఈలోకం ఎరుగవు. ఆపిల్ల – నిన్ను ప్రేమిస్తోంది రా. ఈ ఛాన్స్ అందరికీ వచ్చేదా? పైగా నిన్నైవత్తె ప్రేమిస్తోందిరా – నీ పేరు, నువ్వూనూ. వలచి వచ్చిన వనిత చులకన అయిందంట్రా నీ దృష్టిలో కూడా! ఏమైనా సరే. మీ ఇద్దరికీ నే పెళ్లి చేయిస్తాను” అని రామ్మూర్తి తండ్రి బయిటకు నడిచాడు. “నాన్నా… నాన్నా… నాకే పెళ్ళొద్దు, నాకే పెళ్ళొద్దు. నాన్నా! నాన్నా!” అని అరిచి కుర్చీలో కూలాడు రామ్మూర్తి.
కొద్ది రోజులు గడిచాయి. లక్ష్మణరావు సరళ కోసం రోజూ ఆడపిల్లల హాస్టల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. రామ్మూర్తి తండ్రి వసంతను కలుసుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రికి ఉత్తరం రాశాడు. అయినా, ఈయన కలుసుకుని పెళ్ళి విషయాల్ని మాట్లాడుకున్నారు. కట్నాలూ, కానుకలూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయాలు వసంతకు తెలుసుగాని, రామ్మూర్తికి తెలియవు. పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటయ్యాయి.
ఒకనాడు వసంత, రామ్మూర్తిని హఠాత్తుగా పోస్టాఫీసును దగ్గర కలుసుకుంది.
“మీలో మంచి, తప్పకుండా నాతో రావాలి” అంది వసంత.
“ఇదిగో వసంతా! నన్నెందుకిలా హింసిస్తున్నావు? నేనేం పాపం చేశాను? నా మానాన నన్ను బ్రతకనివ్వవెందుకని? నన్ను వదిలిపెట్టు – ఈ రొడ్డుమీద ఇంతమంది తిరుగుతున్నారు. వాళ్ళెవరైనా పోయి ప్రేమించు! ప్రేమించు….)” అని భోరున ఏడవడం మొదలుపెట్టాడు.
“ఊరుకోండి. ఇది పబ్లిక్ప్లేసు. పార్కుకి పోదాం పడండి. అక్కడ ఏడవద్దురు గాని” అని వసంత, రామ్మూర్తిని పార్కులోకి లాక్కుపోయింది.
“ఇదిగో ఇటు చూడండి – ఆ కోయిలలు ఎంత బాగా పాడుతున్నాయో – అటు చూడండి – ఆ పక్షుల జంట ఎంత బావుందో,” అన్నది వసంత కూచుంటూ.
“నువ్వు ఏదవనీ మరి” అన్నాడు రామ్మూర్తి ఏడుపు మొహం వేసి.
“చూడండి, నన్ను మీరెందుకని సందేహిస్తున్నారూ? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదు. మీరు లేని నా జీవితం వృథా గదా సదా! నిజం రామ్! మనిద్దరం వివాహం చేసుకుంటే, హాయిగా చిలకా గోరింటాకు ఉంటాము. మీరంటే నాకు ఎంత ఆపేక్ష, ఎంత అభిమాన! ఎంత ప్రేమ! మిమ్మల్ని గుమ్మం కదల నివ్వను. ఎంత తగలనివ్వకుండా అపురూపంగా చూసుకుంటాను. నన్ను కనికరించండి – నా రామ” అన్నది వసంత అతని హృదయం మీద పిట్టలా వాలిపోతూ.
రామ్మూర్తి కరిగాడు. నెమ్మదిగా ఆమె బుగ్గమీద చెయ్యివేసి నిమిరాడు. “ఆహా!” అన్నాడు. అటుకంటే హాయిగా “అమ్మా” అన్నది వసంత.
వసంతకు, రామ్మూర్తికి వివాహం జరిగిపోయింది. వసంత పొంగిపోయింది. రామ్మూర్తికూడా సంబరపడ్డాడు. “ప్రేమంటే ఇంత తియ్యగా ఉంటుందని తెలీదే నాకు” అనుకున్నాడు.
శోభనం మందిరంలో ప్రవేశించిన వసంత రామ్మూర్తిని గాఢంగా కౌగిలించుకుని, ఉక్కిరి బిక్కిరి చేసేసి ముద్దుపెట్టుకుంది. “నా రామ” అంది. “నా కలల పండాయి” అంది. “నా నోములు ఫలించాయి” అంది. అతన్ని తీసుకుపోయి మంచంపైన కూచోపెట్టుకుని – పలు రకముల స్వీట్లూ తినిపించింది; అంతకంటే తియ్యని కబుర్లూ చెప్పింది.
“చూశారా రామ్! మీకోసం నేను ఎంత శ్రమపడ్డాను – ఎన్ని బాధలు పడ్డాను! ఇంక మనం హాయిగా, తియ్యగా…” అంటూ అతన్ని దగ్గరగా లాక్కుంది.
వసంత కాపురానికికొచ్చిన కొన్నాళ్లకు : రామ్మూర్తి పెరట్లో పాతికోసం రోలు ముందు కూర్చుని అయాసపడిపోతూ, చెమటలు కక్కుకుంటూ, ఎవర్నో ఇంగ్లీషులో తిట్టుకుంటూ పచ్చడి రుబ్బుతున్నాడు. వసంత చక్కగా చిలకల్లే ముస్తాబై వచ్చి అపురూపంగా, ఆప్యాయంగా, తన భర్తను చూసుకుని – “ఇంకా కాలేదా? తొందరగా కానండి. అదయితే ఇంకా అన్నం వండాలి. సరే, నేను వెళుతున్నాను. బయట ప్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమాకు వేళవుతోంది. ఇల్లు జాగ్రత్త! పదవుతుందేమో నేను వచ్చేసరికి!” అంటూ వడవడిగా సాగిపోయింది వసంత.
రామ్మూర్తి వినపడకుండా నిట్టూర్చాడు వీధి గుమ్మం కేసి చూస్తూ. ఆ చూపులో అతనికి మూడు నిమిషాల అనంతరం లక్షణాలు దొరకాడు – ఊషారుగా ఇంట్లోకి ప్రవేశిస్తూ.
“రామ్మూర్తి – ఫరవాలేదులే! ఇట్లా కాచుంటా. చిన్న విషయం – పొద్దున్న నేను బస్సులో కూచుని ప్రయాణం చేస్తున్నాను. బస్సు చాలా రద్దీగా ఉంది. నించున్న వాళ్ళల్లో – నాకు దగ్గరగా సరళ కూడా కనిపించింది. కనిపిస్తే…”
“కొంపతీసి సీటు ఇచ్చావేమిటి?” అన్నాడు రామ్మూర్తి అమాంతంగా అంత ఎత్తుకు ఎగిరి, పచ్చడి చేతుల్ని నెత్తికి పులుముకుంటూ!








