టీటీడీ కొత్త చైర్మన్‌పై ఉత్కంఠ.. బీఆర్ నాయుడికి మరో ఛాన్స్ దక్కేనా..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu)కు మరోసారి అవకాశం కల్పిస్తారా? లేక కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ నియామకం కోసం కూటమి ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నవంబర్‌లో బీఆర్ నాయుడిని టీటీడీ 54వ చైర్మన్‌గా నియమించింది. నవంబర్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు. మీడియా రంగంలో గుర్తింపు పొందిన ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. దీంతో కీలకమైన టీటీడీ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. రెండేళ్ల పాటు కొనసాగిన ఆయన పదవీకాలం ఇప్పుడు ముగియడంతో తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ పెరిగింది.
బీఆర్ నాయుడు తన పదవీకాలంలో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో కఠినమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు దర్శన ప్రక్రియ మరింత సులభంగా ఉండేందుకు సాంకేతిక విధానాలను ప్రోత్సహించారు. వసతి గదుల కేటాయింపు, కాటేజీల బుకింగ్‌తో పాటు నిత్యాన్నదాన కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ-టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం కల్పిస్తే పాలనలో కొనసాగింపు ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
అయితే టీటీడీ చైర్మన్ నియామకం కేవలం పాలనాపరమైన అంశం మాత్రమే కాదు. కూటమిలోని రాజకీయ సమీకరణాలు కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొత్త పాలకమండలిపై నిర్ణయం ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. తాత్కాలికంగా అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీకి బాధ్యతలు అప్పగించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యమైతే టీడీపీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru), కిమిడి కళా వెంకటరావు (Kimidi Kala Venkata Rao) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో టీటీడీ చైర్మన్ పదవిపై ఆసక్తి చూపిన కళా వెంకటరావుకు ఈసారి అవకాశం దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణపై విజయం సాధించినప్పటికీ, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఆయన అనుచరుల్లో అసంతృప్తికి కారణమైందనే ప్రచారం ఉంది. దీంతో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ కూడా కీలక పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరుతున్నారనే ప్రచారం ఉంది. సామాజిక సమీకరణాల పరంగా కూడా ఆయన పేరును అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
ఇలా బీఆర్ నాయుడు కొనసాగింపుతో పాటు కళా వెంకటరావు, జ్యోతుల నెహ్రూ పేర్లు తెరపైకి రావడంతో టీటీడీ కొత్త నాయకత్వంపై ఆసక్తి పెరిగింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి మొగ్గు చూపుతారు? ప్రస్తుత చైర్మన్‌కే మరో అవకాశం ఇస్తారా? లేక సీనియర్ నేతల్లో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది వేచి చూడాలి.








