సౌత్ మూవీ వర్కింగ్ స్టైల్‌పై జాన్వీ కామెంట్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) మరోసారి సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటుంది. సౌత్ సినీ ఇండస్ట్రీల్లో సినిమా తెరకెక్కించే విధానంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఇటీవల కరణ్ జోహార్(Karan Johar) నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్9 లో పాల్గొన్న జాన్వీ.. పెద్ది(Peddi) సినిమాలో తన క్యారెక్టర్ కు సంబంధించి ఎదురైన విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా సౌత్ సినిమాల షూటింగ్ విధానాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో డిస్కషన్ కు దారితీశాయి.
సౌత్ సినిమాల్లో ముందుగానే పూర్తి స్క్రిప్ట్ అందుబాటులో ఉండటం చాలా అరుదని, అలాగే కెమెరా యాంగిల్స్ గురించి కూడా నటీనటులకు ముందస్తు సమాచారం ఉండకపోవచ్చని జాన్వీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కొనసాగుతున్న కొద్దీ సీన్స్ షూటింగ్ విధానాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చిందని, కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించానని ఆమె వెల్లడించారు. అయితే జాన్వీ చేసిన కామెంట్స్ తెలుగు ప్రేక్షకుల్లో కొంతమందికి ఆగ్రహం తెప్పించాయి.
ఒకటి రెండు సినిమాల్లో ఎదురైన అనుభవాలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే గాటన కట్టడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇండస్ట్రీకి ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతులు, పని విధానాలు ఉంటాయని గుర్తుచేస్తున్నారు. పెద్ది సినిమా షూటింగ్లో ఎదురైన అనుభవాలకే పరిమితమై మాట్లాడాల్సిందని కొందరు సూచిస్తున్నారు. తన అభ్యంతరాలను షూటింగ్ టైమ్ లోనే క్లారిటీగా ఎందుకు వ్యక్తం చేయలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో జాన్వీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చతో పాటు ట్రోలింగ్ కూడా కొనసాగుతోంది.








