అమెరికా ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో AI నిర్ణయిస్తోందా? షాకింగ్ కదా!!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం తీసుకోవడానికి అభ్యర్థుల ప్రచార సభలకు వెళ్లేవారు. టీవీ చర్చలు చూసేవారు. వార్తాపత్రికలు చదివేవారు. కానీ ఇప్పుడు అమెరికాలో పరిస్థితి మారుతోంది. ఓటు వేయబోయే ముందు కొందరు నేరుగా ChatGPTని అడుగుతున్నారు. మా ప్రాంతంలో ఎవరు పోటీ చేస్తున్నారు? వాళ్లలో ఎవరు ఏం చేశారు? ఏ అభ్యర్థి ఏ విధానానికి మద్దతు ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడే ఓ కొత్త సమస్య బయటపడింది. ఓటర్లకు సమాధానాలు చెబుతున్న AI చాట్బాట్లు.. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయో తెలుసా? పేరున్న వార్తా సంస్థల నుంచో, అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల నుంచో మాత్రమే కాదు. నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని చిన్న వెబ్సైట్ల నుంచి కూడా సమాచారాన్ని తీసుకుంటున్నాయి. వాటిలో కొన్ని వెబ్సైట్లు AI సాయంతోనే తయారవుతున్నాయి. అంటే ఒక AI తయారుచేసిన సమాచారాన్ని మరో AI నమ్మి, దాన్నే నిజమని ఓటర్లకు చెప్పే పరిస్థితి ఏర్పడుతోంది.
అమెరికా 2026 మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ పరిణామం ఇప్పుడు టెక్నాలజీ, ప్రజాస్వామ్య రంగాల్లో చర్చకు దారితీస్తోంది.
ఓటర్ల కోసం మొదలైన వెబ్సైట్.. AIకి ప్రధాన సమాచార వనరుగా !
బెన్ టోర్రెస్ ఎజ్రిక్ అనే టెక్నాలజీ నిపుణుడు అమెరికా ఓటర్లకు ఒకే చోట ఎన్నికల సమాచారం అందించాలనే ఉద్దేశంతో ‘Ballot Brief’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమెరికాలో వేలాది మంది అభ్యర్థులు పోటీలో ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి సమాచారం సేకరించడం సామాన్య ఓటరుకు కష్టమైన పని. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన AI టెక్నాలజీని ఉపయోగించారు.
ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ల నుంచి అభ్యర్థుల వివరాలను సేకరించి, వారి రాజకీయ నేపథ్యం, గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికల హామీలను ఒకచోట చేర్చేలా డిజిటల్ AI ఏజెంట్లను రూపొందించారు. అయితే ఆయన ఆలోచనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ వెబ్‌సైట్‌ను మనుషులే కాకుండా ChatGPT, Microsoft Copilot వంటి AI చాట్బాట్లు కూడా ఉపయోగించుకునేలా చేయాలనుకున్నారు.
ఆ ప్రయత్నం అనూహ్యంగా ఫలించింది. వాషింగ్టన్ పోస్ట్ నిర్వహించిన పరీక్షల్లో ChatGPT ఎన్నికలకు సంబంధించిన సమాధానాల్లో 22 శాతం సందర్భాల్లో Ballot Brief వెబ్‌సైట్‌ను ప్రస్తావించింది. Microsoft Copilot అయితే ఏకంగా 75 శాతం సమాధానాల్లో ఈ వెబ్‌సైట్‌ను ఆధారంగా చూపించింది.
ఎజ్రిక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య 30 రోజుల వ్యవధిలో మైక్రోసాఫ్ట్ AI వ్యవస్థలు ఆయన వెబ్‌సైట్‌ను 6.8 లక్షల సార్లకు పైగా ప్రస్తావించాయి.
అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియని వెబ్సైట్.. ఇప్పుడు అమెరికా ఓటర్లకు సమాచారం అందించే AI వ్యవస్థల్లో కీలక వనరుగా మారిపోయింది.
AI చెప్పిందని నమ్మేస్తే.. అసలు నిజం వేరే ఉంటే?
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. Ballot Brief వెబ్సైట్లో వాషింగ్టన్ పోస్ట్ జరిపిన పరిశీలనలో కొన్ని తీవ్రమైన తప్పులు బయటపడ్డాయి.
ఉదాహరణకు.. అమెరికా సెనేటర్ జాన్ హస్టెడ్ తన పదవిలోకి రాకముందే ఆమోదం పొందిన ఓ బిల్లుకు ఆయన మద్దతు ఇచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొన్నారు. మరీ విచిత్రంగా, ఈ తప్పు సమాచారాన్నే Microsoft Copilot కూడా తన సమాధానంలో పునరావృతం చేసింది.
కాలిఫోర్నియాలో పోటీ చేస్తున్న ఇద్దరు వేర్వేరు రాబర్ట్ గార్సియాలను ఒకే వ్యక్తిగా చూపించింది. పలువురు కాంగ్రెస్ సభ్యులకు సంబంధించిన కమిటీ పదవులను తప్పుగా పేర్కొంది. మరికొందరి ఓటింగ్ రికార్డులు కనిపించలేదు.
ఇప్పుడు ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఒక ఓటరు తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి ChatGPTని అడిగాడు. చాట్‌బాట్ ఒక వెబ్సైట్ నుంచి తప్పు సమాచారాన్ని తీసుకుంది. దాన్నే నిజమని భావించి సమాధానం ఇచ్చింది. ఆ ఓటరు కూడా AI చెప్పిన మాటను నమ్మాడు.
ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందో ఓటరుకు తెలియదు. AI సమాధానం ఇచ్చింది కాబట్టి అది నిజమేనని అనుకునే ప్రమాదం ఉంది.
AI తయారు చేసిన సమాచారాన్నే.. మరో AI నమ్ముతోంది!
ఈ సమస్య Ballot Brief వెబ్‌సైట్‌తోనే ఆగిపోలేదు. DecodeTheVote, Smarter. Vote అనే మరో రెండు వెబ్సైట్లు కూడా ఇదే తరహాలో పనిచేస్తున్నాయి. అభ్యర్థుల రాజకీయ నేపథ్యం, వారి రికార్డులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంశాలను AI సాయంతో విశ్లేషిస్తున్నాయి.
ఈ వెబ్సైట్లను కూడా AI చాట్బాట్లు తమ సమాధానాల్లో తరచుగా ప్రస్తావిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశీలనలో వెల్లడైంది.
Smarter.Vote వ్యవస్థాపకుడు జాకబ్ లుకోటా తన వెబ్‌సైట్‌ను AI బాట్లు 17 లక్షల సార్లకు పైగా ప్రస్తావించాయని తెలిపారు. సాధారణంగా వెబ్‌సైట్‌ను సందర్శించే మనుషుల సంఖ్య కంటే AI వ్యవస్థల నుంచి వచ్చిన ప్రస్తావనలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
తన వెబ్సైట్లో సమాచారానికి సంబంధించిన మూలాలను స్పష్టంగా పేర్కొనడం వల్ల AI చాట్బాట్లు దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వెబ్సైట్లన్నీ పెద్ద మీడియా సంస్థల మాదిరిగా భారీ సిబ్బందితో పనిచేయడం లేదు. AI సాయంతోనే పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, ప్రచురిస్తున్నాయి. తక్కువ మంది మనుషులతో వేలాది మంది అభ్యర్థుల వివరాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాయి.
ChatGPT కూడా తన సమాధానాలను మార్చుకుంది!
వాషింగ్టన్ పోస్ట్ ఆరు ప్రముఖ AI సంస్థల చాట్బాట్లను పరీక్షించింది. OpenAI, Anthropic, Google, Microsoft, Amazon, Perplexity రూపొందించిన వ్యవస్థలను ఈ పరిశీలనలో ఉపయోగించింది.
అమెరికాలోని సుమారు 3,100 కౌంటీల చిరునామాలను ఆధారంగా తీసుకుని, 2026 నవంబర్ ఎన్నికల కోసం ఓటర్ల గైడ్ తయారు చేయాలని కోరింది. ప్రతి ప్రాంతంలో ఎవరు పోటీ చేస్తున్నారు? అభ్యర్థుల ప్రధాన విధానాలేంటి? అనే వివరాలు అడిగింది.
ఈ పరీక్షల్లో చాట్బాట్లు అనేక సందర్భాల్లో చిరునామాలను సరైన కాంగ్రెస్ నియోజకవర్గాలతో అనుసంధానించలేకపోయాయి. కొన్ని సందర్భాల్లో సమాధానాలు ఇవ్వడంలోనూ విఫలమయ్యాయి.
మొదటి విడత పరీక్షల్లో ChatGPT ఎక్కువగా ఉపయోగించిన వెబ్సైట్లలో Ballot Brief అగ్రస్థానంలో ఉంది. అయితే వాషింగ్టన్ పోస్ట్ తన పరిశోధన ఫలితాలను OpenAIకి తెలియజేసిన తర్వాత రెండో విడత పరీక్షల్లో ఆ వెబ్సైట్ ప్రస్తావన 22 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది.
సమస్యలను గుర్తించినప్పుడు AI సమాధానాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని OpenAI తెలిపింది. మరోవైపు Copilot విషయంలోనూ ఫలితాలను పరిశీలిస్తున్నామని Microsoft వెల్లడించింది.
ఇది అమెరికాతో ఆగిపోతుందా?
ఈ పరిణామం వెనుక మరో పెద్ద సమస్య ఉంది. AI చాట్బాట్లు ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతుకుతున్నప్పుడు, ఆ సమాచారం నిజమైనదా కాదా అని ప్రతిసారీ నిర్ధారించుకోవడం సులభం కాదు. ఒక వెబ్సైట్లో ఉన్న తప్పు సమాచారాన్ని మరో వెబ్సైట్ ప్రచురించవచ్చు. ఆ తర్వాత AI వ్యవస్థలు వాటిని వేర్వేరు మూలాల నుంచి వచ్చిన సమాచారంగా భావించి అదే తప్పును మరింత బలపరిచే అవకాశం ఉంది.
నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకుడు మోవాఫక్ అల్లహామ్ నిర్వహించిన అధ్యయనంలో రాజకీయాలు, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాలపై చాట్బాట్లు ఇచ్చిన సమాధానాల్లో ఉపయోగించిన సమాచార వనరుల్లో 16 శాతం AI రూపొందించినవేనని గుర్తించారు.
అంటే ఇంటర్నెట్లో AI తయారుచేసిన కంటెంట్ పెరుగుతున్న కొద్దీ, AI వ్యవస్థలు వాటిపైనే ఎక్కువగా ఆధారపడే ప్రమాదం ఉందన్నమాట.
ఇది ఎన్నికలకే పరిమితమైన సమస్య కాదు. ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక నిర్ణయాలు.. ఇలా మన రోజువారీ జీవితానికి సంబంధించిన సమాచారంలోనూ ఇలాంటి తప్పులు ప్రభావం చూపవచ్చు.
ఓటు మనదే.. కానీ తీసుకునే డెసిషన్ కు బేస్ ఎవరు?
ఇప్పటివరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించేవి. అభ్యర్థులు సభలు నిర్వహించేవారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. మీడియా ద్వారా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు.
కానీ ఇప్పుడు మరో మార్గం తెరుచుకుంటోంది. ఓటర్లు రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవడానికి AIని ఆశ్రయిస్తున్నారు. AI మాత్రం తనకు దొరికిన వెబ్సైట్ల సమాచారాన్ని ఉపయోగించి సమాధానాలు ఇస్తోంది. ఆ సమాచారాన్ని ఎవరు తయారుచేశారు? అందులో నిజమెంత? తప్పులెన్ని? అనేది ఓటరుకు తెలియకపోవచ్చు.
అందుకే ఎన్నికల సమయంలో AI ఇచ్చే సమాధానాలను తుది నిర్ణయంగా తీసుకోకుండా, అధికారిక ఎన్నికల వెబ్సైట్లు, అభ్యర్థుల ప్రకటనలు, విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా వివరాలను సరిచూసుకోవడం ముఖ్యం.
ఎందుకంటే ఓటు వేసేది మనమే అయినా.. ఆ ఓటు వేయడానికి ముందు మనకు సమాచారం అందిస్తున్నది ఎవరు? అనేది ఇప్పుడు అంతకంటే కీలకమైన ప్రశ్నగా మారుతోంది.








