మూడేళ్లుగా కడుపులోనే ‘రాతి బిడ్డ’.. స్కానింగ్‌లో బయటపడిన నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక మహిళకు కడుపునొప్పి వస్తోంది. ఏదో బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇబ్బంది మరింత పెరుగుతోంది. చివరకు భరించలేక ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయించడంతో బయటపడిన విషయం ఆమెనే కాదు, డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఆమె కడుపులో ఉన్నది సాధారణ కణితి కాదు.. మూడేళ్ల క్రితం గర్భంలో ఏర్పడి, ఆ తర్వాత మరణించిన శిశువు అస్థిపంజరం! అది కూడా మామూలుగా కాదు.. శరీరంలోనే కాల్షియం పేరుకుపోయి రాయిలా గట్టిపడిపోయింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, వైద్య ప్రపంచంలో నిజంగా జరిగిన అరుదైన ఘటన ఇది.
ఆఫ్రికాలోని సోమాలిలాండ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళకు ఈ వింత అనుభవం ఎదురైంది. మూడేళ్లుగా ఆమె కడుపులో ఏదో తెలియని నొప్పి వేధిస్తోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవలి నెలల్లో పొట్టలో బరువు పెరుగుతున్నట్లు అనిపించడం, నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు చేసిన పరీక్షలు, ఆ తర్వాత తీసిన స్కానింగ్ చిత్రాలు చూస్తే అసలు విషయం అర్థమైంది.
మూడేళ్ల క్రితం గర్భం వచ్చినట్లే అనిపించింది.. ఆ తర్వాతే అసలు సమస్య!
వైద్యులు ఆమె గత ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగినప్పుడు మూడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది. అప్పట్లో ఆమెకు గర్భం వచ్చినట్లుగానే అనిపించిందట. రోజులు గడుస్తున్న కొద్దీ పొట్ట కూడా పెరిగింది. అంతేకాదు, కడుపులో బిడ్డ కదులుతున్నట్లు కూడా అనిపించేదట. కానీ కొంతకాలం తర్వాత ఆ కదలికలు ఆగిపోయాయి. పొట్ట పెరగడం కూడా నిలిచిపోయి, క్రమంగా తగ్గిపోయింది.
దీంతో గర్భధారణకు సంబంధించి ఏదో జరిగి ఉంటుందని భావించినా, ఆమె ఆసుపత్రికి వెళ్లలేదు. ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. ఆ సమయంలో తన శరీరంలో ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. అలా మూడేళ్లు గడిచిపోయాయి. అయితే లోపల మాత్రం మరో సమస్య మొదలైంది. కడుపులో నొప్పి, బరువు పెరుగుతున్న భావన క్రమంగా ఎక్కువయ్యాయి. చివరకు ఆసుపత్రికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది.
స్కానింగ్‌లో కనిపించింది చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు!
ఆసుపత్రిలో వైద్యులు ఆమె పొట్టను పరీక్షించినప్పుడు నాభి వరకు విస్తరించిన గట్టి పదార్థం ఉన్నట్లు గుర్తించారు. చేతితో తాకినా అది పెద్దగా కదలడం లేదు. రక్త పరీక్షల్లో స్వల్ప రక్తహీనత తప్ప పెద్దగా సమస్యలేమీ కనిపించలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా నెగెటివ్ వచ్చింది. అల్ట్రాసౌండ్ చేయగా గర్భాశయం ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. కానీ పొత్తికడుపులో మాత్రం కాల్షియం పేరుకుపోయి గట్టిపడిన ఓ పెద్ద ఆకారం కనిపించింది.
అసలు అది ఏమిటో తెలుసుకోవడానికి వైద్యులు మరింత అధునాతనమైన CT స్కాన్ చేయించారు. అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ గట్టి పదార్థంలో శిశువుకు సంబంధించిన పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు, చేతులు, కాళ్ల ఎముకలు స్పష్టంగా కనిపించాయి. అంటే అది కేవలం కణితి కాదు.. ఒకప్పుడు తల్లి గర్భంలో ఏర్పడిన శిశువు అవశేషాలు! దాదాపు 18 × 13 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఆ నిర్మాణాన్ని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.
అసలు శరీరంలోనే బిడ్డ రాయిలా ఎలా మారుతుంది?
వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘లిథోపెడియన్’ (Lithopedion) అంటారు. సాధారణంగా దీన్నే ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే.. ప్రతి గర్భధారణ గర్భాశయంలోనే జరగాలని లేదు. కొన్ని సందర్భాల్లో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయానికి చేరకుండా, పొత్తికడుపులోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతుంది. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అదే పొత్తికడుపులోని అవయవాల చుట్టూ పిండం అభివృద్ధి చెందితే దాన్ని అబ్డామినల్ ప్రెగ్నెన్సీగా పిలుస్తారు.
ఇలాంటి గర్భధారణలు తల్లికి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే పిండానికి రక్తాన్ని అందించే మావి పొత్తికడుపులోని ఇతర అవయవాలు, సున్నితమైన రక్తనాళాలకు అతుక్కుంటుంది. దీనివల్ల తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిండం బతికే అవకాశం కూడా చాలా తక్కువ.
అయితే పిండం మరణించిన తర్వాతే మరో విచిత్రమైన ప్రక్రియ మొదలవుతుంది. పిండం పరిమాణం ఎక్కువగా ఉండి, దాన్ని శరీరం సహజంగా విచ్ఛిన్నం చేసి తొలగించలేని పరిస్థితి ఏర్పడితే, రోగనిరోధక వ్యవస్థ దాన్ని శరీరానికి సంబంధం లేని పదార్థంగా గుర్తిస్తుంది. దాంతో దాని చుట్టూ కాల్షియం పేరుకుపోవడం మొదలవుతుంది. అలా కొంతకాలానికి పిండం అవశేషాలు పూర్తిగా గట్టిపడి రాయిలాంటి నిర్మాణంగా మారతాయి. శరీరం లోపల ఉన్న ఆ అవశేషాల వల్ల ఇన్ఫెక్షన్లు, వాపు వంటి సమస్యలు రాకుండా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ఇలా జరుగుతుంది.
ఈ మహిళ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని వైద్యులు భావించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన పిండం అక్కడే మరణించడంతో, కాలక్రమేణా దాని చుట్టూ కాల్షియం పేరుకుపోయి గట్టిపడిపోయింది. ఇప్పుడు ఆమెకు వస్తున్న కడుపునొప్పికి కూడా అదే కారణమని తేల్చారు.
చివరకు ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
అసలు సమస్య ఏమిటో నిర్ధారణ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. పొత్తికడుపులో, పెల్విక్ ప్రాంతంలో ఉన్న ఆ కాల్షియం గడ్డను పూర్తిగా తొలగించారు. ఆపరేషన్ తర్వాతి రోజు ఆమెకు స్వల్ప జ్వరం, వికారం వంటి సమస్యలు వచ్చినప్పటికీ, చికిత్సతో అవి తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆపరేషన్‌తో సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఆ తర్వాత ఆరు నెలల పాటు వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. ఆమె పూర్తిగా కోలుకోవడమే కాకుండా, మూడేళ్లుగా వేధిస్తున్న కడుపునొప్పి కూడా మాయమైంది.
400 ఏళ్లలో నమోదైనవి కేవలం 340 కేసులే!
ఈ ఘటన ఇంతగా చర్చకు రావడానికి మరో కారణం ఉంది. ‘స్టోన్ బేబీ’ అనేది ప్రపంచ వైద్య చరిత్రలో అత్యంత అరుదైన పరిస్థితుల్లో ఒకటి. గత 400 ఏళ్లలో వైద్య పరిశోధనల్లో ఇలాంటి కేసులు కేవలం 340 మాత్రమే నమోదయ్యాయి. మొట్టమొదటి కేసు 1582లో నమోదైనట్లు వైద్య రికార్డులు చెబుతున్నాయి.
ఇలాంటి కేసుల్లో చాలావరకు మహిళలకు తమకు ఎప్పుడో జరిగిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలియకుండానే దశాబ్దాలు గడిచిపోతుంటాయి. వయసు పెరిగిన తర్వాత ఇతర ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఉదాహరణకు భారత్‌కు చెందిన ఓ 74 ఏళ్ల మహిళ తన పొత్తికడుపులో ఇలాంటి ‘స్టోన్ బేబీ’ని మూడు దశాబ్దాలకు పైగా మోసినట్లు గతంలో ఓ కేసు నమోదైంది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మహిళ వయసు 42 ఏళ్లు మాత్రమే. ఆమెకు ఈ సమస్య ఏర్పడిన మూడేళ్లకే బయటపడటం ఈ కేసులో ప్రత్యేకత.
ఈ ఘటన చెప్పే అసలు విషయం ఇదే!
ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. సోమాలిలాండ్ వంటి ప్రాంతాల్లో గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునే సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండవు. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభ దశలో స్కానింగ్ చేయించుకోకపోతే, ఇలాంటి అసాధారణ పరిస్థితులు గుర్తించకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఈ మహిళ కూడా మూడేళ్ల క్రితం తనకు గర్భం వచ్చినట్లుగా అనిపించినప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది.
ఒకప్పుడు గర్భంలో బిడ్డ పెరుగుతోందని భావించింది. ఆ తర్వాత ఆ కదలికలు ఆగిపోయాయి. అంతా సాధారణంగానే ఉందనుకుంది. కానీ తన శరీరంలోనే ఆ పిండం కాలక్రమేణా రాయిలా గట్టిపడిపోయిందని ఆమెకు తెలియదు. మూడేళ్ల తర్వాత కడుపునొప్పి రూపంలో బయటపడిన ఈ నిజం వైద్య ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. మనిషి శరీరం ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఎంత విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటుందో చెప్పడానికి ఈ ‘స్టోన్ బేబీ’ ఘటన ఓ అరుదైన ఉదాహరణ!








