ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు
– మెరుగైన వైద్యం అందించాలని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి వైద్యులను కోరిన మంత్రి నారా లోకేష్
– బెంగళూరు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన లోకేష్
– అధికారులు, వైద్యులతో సమీక్ష
అమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో ఉన్మాది దాడితో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆదేశాల మేరకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి (Manipal Hospital) తరలించారు. లోకేష్ ముందుగానే మణిపాల్ ఆసుపత్రి ఉన్నత స్థాయి వైద్య వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాలికను తరలించేందుకు గ్రీన్ ఛానల్ (Green Channel) ఏర్పాటు కోసం కర్ణాటక ప్రభుత్వం ( Karnataka Government )తో మంత్రి మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించడమే ధ్యేయంగా మంత్రి ప్రతిక్షణం జిల్లా యంత్రాంగం, వైద్యులతో మాట్లాడుతూ సమన్వయ పరుస్తున్నారు. బాలికపై ఉన్మాది దాడి చేసిన ఘటన తెలిసిన క్షణం నుంచి పోలీసు, విద్య, జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి లోకేష్ మాట్లాడుతూనే… మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరు తరలింపు ఏర్పాట్లు పర్యవేక్షించారు.








