రాజకీయాలకు కొత్త వేదిక.. సోషల్ మీడియాలో మరో కోణాన్ని చూపిస్తున్న విజయసాయిరెడ్డి..
రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పార్టీ వ్యూహాలు, రాజకీయ విమర్శలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆయన.. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఆయన కనిపిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఒకప్పుడు రాజకీయ ప్రకటనలకే పరిమితమైన ఆయన, ఇప్పుడు వ్యక్తిగత అనుభవాలు, సామాజిక అంశాలు, స్ఫూర్తిదాయక కథనాలను కూడా ప్రజలతో పంచుకుంటున్నారు.
ఇటీవల ఆయన షేర్ చేస్తున్న వీడియోల్లో సామాజిక సందేశాలకు ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రముఖ నటుడు తారకరత్న కుమార్తెతో కలిసి గడిపిన ఓ సందర్భాన్ని వీడియోగా పంచుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మరో వీడియోలో మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టు తబాహీ అనే యువకుడి ప్రయత్నాన్ని ప్రస్తావించారు. అజ్నార్ నదిని శుభ్రం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఆ యువకుడు ఎదుర్కొన్న విమర్శలు, అవరోధాలను అధిగమించిన తీరును ఉదాహరణగా చూపించారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన పనిని ఇతరుల విమర్శల కారణంగా మధ్యలో వదిలేయకూడదనే సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు.
ఈ తరహా పోస్టులు విజయసాయిరెడ్డి ప్రజాజీవితంలో మరో కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. అయితే ఆయన సోషల్ మీడియా చురుకుదనాన్ని కేవలం వ్యక్తిగత ఆసక్తిగా మాత్రమే చూడలేని పరిస్థితి ఉంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ (A Convention) వేదికగా పార్టీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదికగా ఎదగడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.
కొత్త పార్టీ విధానాల విషయంలోనూ కొన్ని అంశాలను ఇప్పటికే ఆయన ప్రస్తావించారు. యువతకు అవకాశాలు కల్పించడం, ఉపాధి కల్పన, వ్యవసాయానికి నీటి భద్రత, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. కుల, మత సమీకరణాల కంటే ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాల ఆధారంగా రాజకీయాలు చేయాలన్నది తన ఆలోచనగా వెల్లడించారు. అయితే ఈ లక్ష్యాలను అమలు చేయడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రజల్లో విశ్వాసం సంపాదించేందుకు ఎలాంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.








