రాప్తాడు స్కూల్ ఘటనపై జగన్ తీవ్ర విమర్శలు..!
అనంతపురం జిల్లా రాప్తాడు(Raptadu) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే చైన్ రంపంతో జరిగిన అనాగరిక దాడిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, ప్రస్తుత పరిస్థితులు ఏపీలో జంగిల్ రాజ్ కు అద్దం పడుతున్నాయని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఒక దుండగుడు యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి, తరగతి గదిలో పిల్లలంతా చూస్తుండగానే బాలికపై ఇంత దారుణంగా ఎలా దాడి చేయగలిగాడని వైఎస్ జగన్ ప్రశ్నించారు. విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లలకు తగిన భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటనే సజీవ నిదర్శనమన్నారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనను పూర్తిగా పక్కన పెట్టేసిందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులు, ‘రెడ్ బుక్’ పాలనకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్లే నేరస్తులకు చట్టమంటే ఏ మాత్రం భయం లేకుండా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ఈ ఘోర ఉదంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లే పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థినులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని కోరారు. దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, పారదర్శక దర్యాప్తు ద్వారా కఠినంగా శిక్షించేలా న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.








