ఈనెల 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర!
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మరోసారి వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తుండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా తన పొలిటికల్ గేమ్‌ను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, నీటి పారుదల రంగానికి సంబంధించి అధికార ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎల్‌నినో ప్రభావం, సాగునీటి ఇబ్బందులు, ప్రాజెక్టుల నిర్వహణ లోపాలను ప్రజలకు వివరించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 11 నుంచి 14 మధ్య రెండు రోజుల పాటు కేటీఆర్ బస్సు యాత్ర ఉంటుందని ఆ పార్టీ నేత గంగుల కమలాకర్ వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభమై, గోదావరి పరీవాహక ప్రాంతంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగనుంది. దెబ్బతిన్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని స్వయంగా పరిశీలించడంతో పాటు, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో బీజేపీ ‘మహా పాదయాత్ర’ పేరిట తన రాజకీయ వేడిని పెంచింది. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన, బీజేపీ కౌంటర్ ర్యాలీలను బీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజలను మళ్లీ తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ ఈ బస్సు యాత్రను ఒక బలమైన అస్త్రంగా మలచుకుంటోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే ఆరు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్రకు కూడా ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి ముందుగా ఈ బస్సు యాత్రను ఒక ట్రయల్ రన్‌గా, ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇదే జోరులో తెలంగాణ ఉద్యమ చారిత్రక ఘట్టమైన దీక్షా దివస్ (నవంబర్ 29) సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 2009లో కేసీఆర్ దీక్ష సమయంలో అరెస్టుకు గురైన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో ఈ సభను నిర్వహించనున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ప్రజా పాలనపై దృష్టిపెడుతుంటే, మరోవైపు బీజేపీ జాతీయ అంశాలతో పాటు స్థానిక సమస్యలపై దూకుడు పెంచింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వస్తుండటంతో తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది.







