నటనలోనే కాదు.. సంపదలోనూ బాద్ షానే..!
కింగ్ ఖాన్ , బాలీవుడ్ బాద్ షా…మూడు దశాబ్దాలకు పైగా వెండితెరపై మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న షారూక్ … వ్యాపార వేత్తగానూ తనదైన ముద్ర వేశారు. సినిమాలతో పాటు క్రీడలు, వినోదం, వీఎఫ్ఎక్స్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం.. షారుఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 10,000 కోట్లు.
గతేడాది హురున్ జాబితాలో ఆయన ఆస్తి విలువ రూ. 12,490 కోట్లుగా పేర్కొన్నారు. తాజా నివేదిక ప్రకారం ఆయన సంపదలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, దేశంలోని అత్యంత సంపన్న నటుడిగా తన అగ్రస్థానాన్ని షారుఖ్ పదిలంగా నిలుపుకున్నారు. ఆయన సంపాదనలో కేవలం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచే కాకుండా వ్యాపారాల ద్వారా కూడా అధిక మొత్తం వస్తోంది.
విలాసవంతమైన ఆస్తులు.. ఖరీదైన కార్లు
షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దేశ, విదేశాల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నాయి. ముంబై బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఆయన ఐకానిక్ బంగ్లా ‘మన్నత్’ వీటిలో ప్రధానమైనది. 2001లో రూ. 18 కోట్లకు కొనుగోలు చేసిన ఈ బంగ్లా ప్రస్తుత విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ బంగ్లాలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ఒక విలాసవంతమైన విల్లా, లండన్‌లోని పార్క్ లేన్‌లో ఒక ఖరీదైన అపార్ట్మెంట్, ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో రూ. 15 కోట్ల విలువైన ఫామ్‌హౌస్ ఉన్నాయి.
విలాసవంతమైన కార్ల సేకరణలోనూ షారుఖ్ ముందుంటారు. ఆయన గ్యారేజీలో రూ. 12 కోట్ల విలువైన బుగాటీ వేరాన్, రూ. 9.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు బెంట్లీ కాంటినెంటల్ జీటీ, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఆయన కలెక్షన్లో ఉన్నాయి.
షారుఖ్ ఖాన్ వ్యాపార ప్రస్థానంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి 2002లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. దీని అనుబంధ సంస్థ ‘రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్’ దేశంలోని అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటిగా పేరుగాంచింది. ‘రా.వన్’, ‘జీరో’, ‘జవాన్’ వంటి చిత్రాలకు ఈ సంస్థ అద్భుతమైన వీఎఫ్ఎక్స్ అందించింది.
క్రీడారంగంలోనూ షారుఖ్ తనదైన ముద్ర వేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ (కేకేఆర్)కు నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతాతో కలిసి సహ యజమానిగా ఉన్నారు. అంతేకాకుండా పిల్లల కోసం వినోదం, విజ్ఞానాన్ని అందించే ‘కిడ్జానియా ఇండియా’ అనే వెంచర్లో కూడా రెడ్ చిల్లీస్ సంస్థకు 26% వాటా ఉంది. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్, మరోవైపు పక్కా ప్రణాళికతో వ్యాపార రంగంలోనూ ‘కింగ్’ అని నిరూపించుకుంటున్నారు.







