ఏఐ ముప్పుపై గళమెత్తిన చిరంజీవి!
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలు ఇప్పుడు సమాజానికి, ముఖ్యంగా సినీ కళాకారులకు పెను ముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రమాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, కళాకారుల హక్కులను కాపాడటానికి కఠినమైన చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏఐ ద్వారా తయారవుతున్న నకిలీ వీడియోలు, ఆడియోలు సమాజాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నాయో, అవి కళాకారుల సృజనాత్మక హక్కులకు, గౌరవానికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తున్నాయో చిరంజీవి వివరించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా.., ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిశీలిస్తోందని, త్వరలోనే కఠినమైన నిబంధనలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఒక అధికారిక వినతిపత్రం సమర్పించాలని ఆయన చిరంజీవికి సూచించారు.
ఇవి కూడా చదవండి
అమిత్ షా సూచన మేరకు.. చిరంజీవి కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలను ఉద్దేశించి ఒక సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సాంకేతికత దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న సమస్యలను మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ఈ అంశంపై తగిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని భరోసా ఇచ్చారు.
నిజానికి ఏఐ, డీప్‌ఫేక్ సాంకేతికతలు సృజనాత్మక రంగంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, మరోవైపు అదే స్థాయిలో నేరాలకు, అసత్య ప్రచారాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. సెలబ్రిటీల ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేసి తప్పుదారి పట్టించే ప్రచారాలు చేయడం, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం విపరీతంగా పెరిగిపోయింది. ఇది కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల భద్రతను, దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. కళాకారుల కష్టంతో సంపాదించుకున్న గుర్తింపును, గౌరవాన్ని క్షణాల వ్యవధిలో మసకబారేలా చేసే ఈ డీప్‌ఫేక్ సంస్కృతిపై కఠినమైన నిరోధక చట్టాలు రావడం అత్యవసరం.
ఈ పరిణామాలపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చిరంజీవి, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులతో పాటు ప్రతి పౌరుడి భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. సాంకేతికత సృజనాత్మకతను పెంచాలి కానీ, గౌరవాన్ని నాశనం చేయకూడదని అభిప్రాయపడ్డారు.
మెగాస్టార్ తీసుకున్న ఈ చొరవ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా, దేశవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగంపై జరుగుతున్న పోరుకు దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వాలు త్వరలోనే సమగ్రమైన చట్టాలను తెచ్చి ఈ ముప్పును అడ్డుకోవాలని ప్రజలు, సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. సాంకేతిక ప్రగతి మానవాళికి మేలు చేయాలే కానీ, ఎవరి వ్యక్తిత్వానికీ భంగం కలిగించకూడదనే సత్యాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.







