అనిరుధ్- కావ్య పెళ్లి వేడుకలు.. రెండు గ్రాండ్ ఈవెంట్స్!
తమిళ సంగీత ప్రపంచంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సీఈఓ కావ్య మారన్(Kavya maran)తో అనిరుధ్ పెళ్లి జరగనుందనే విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకను గ్రీస్‌లో అత్యంత పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అనిరుధ్ లేదా కావ్య మారన్ నుంచి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
విదేశాల్లో పెళ్లి అయిన తర్వాత చెన్నైలో రెండు స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట చెన్నైలోని ప్రముఖ ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వానాలను గెస్టులకు పంపించే ప్రక్రియ ప్రారంభమయ్యాయి.
రిసెప్షన్ తర్వాత చెన్నై శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో మరో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని కేవలం అనిరుధ్, కావ్య మారన్ల అత్యంత సన్నిహిత స్నేహితుల కోసం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్‌కు ఉన్న క్రేజ్, మరోవైపు కావ్య మారన్‌కు చెందిన వ్యాపార, క్రీడా రంగాల నేపథ్యం ఈ వార్తకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. అయితే పెళ్లి డేట్, వెన్యూ ఇతర వివరాలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








