మల్లారెడ్డి ఫామ్‌హౌస్‌పై హైడ్రా కొరడా!
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు లక్ష్యంగా హైడ్రా కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. కొంపల్లి పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాడిపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దులాపల్లి గ్రామం, జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్ 124లో మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ ఉంది. దీన్ని చెరువు భూములను ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. చెరువులోకి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, మట్టి, పూడికను అక్రమంగా నింపి సుమారు 500 మీటర్ల పొడవున బండ్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిమితుల్లో దాదాపు 15 ఎకరాల మేర భూమిని ఆక్రమించి భారీ ప్రహరీ గోడలు, ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది.
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ మాత్రమే కాకుండా, సర్వే నంబర్లు 41, 42 పరిధిలోని సుమారు 20 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించి సుప్రీంకోర్టు అడ్వకేట్ సౌరభ్ రాజ్ వర్మ నిర్మించిన మరో భారీ ప్రహరీ గోడను కూడా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పటికీ, రెవెన్యూ, హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ హద్దుల గుర్తులను చూపించి ముందుకెళ్లారు. వీటితోపాటు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో అనధికారికంగా భూగర్భ జలాలను వాణిజ్య అవసరాల కోసం తోడేస్తున్న ఏడు అక్రమ బోరుబావులు, ఆరు వాటర్ సంపులను కూడా అధికారులు ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకునే హైడ్రాను ఒక రాజకీయ అస్త్రంగా వాడుతోందని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి కేవలం హైడ్రా పేరుతో ప్రచార ఆర్భాటాలకు పోతున్నారని, బీఆర్ఎస్ ముఖ్య నేతలను మానసిక క్షోభకు గురిచేయడమే లక్ష్యంగా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికార బలంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు పాల్పడ్డారో వారందరిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఫాక్స్ సాగర్ వంటి చారిత్రక జలాశయాలను కాపాడకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి తీవ్ర నీటి ఎద్దడి, ముంపు ముప్పు పొంచిఉందని, అందుకే హైడ్రాను రంగంలోకి దించామని అధికార పార్టీ వాదిస్తోంది.







