బాలకృష్ణ ‘లెజెండ్’పై రాధికా ఆప్టే విమర్శలు., షాకింగ్ కామెంట్స్!
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ సినిమా గుర్తుందిగా! 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. బాలయ్య అభిమానులకు ఇప్పటికీ ఈ సినిమా ప్రత్యేకమే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్కా’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రాధికా ఆప్టే.. ‘లెజెండ్’ సినిమాలో తన పాత్ర గురించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమా తన కెరీర్లోనే అత్యంత కష్టమైన అనుభవాల్లో ఒకటని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన పాత్రకు సంబంధించిన కొన్ని అంశాలు తనకు అసౌకర్యంగా అనిపించాయని వెల్లడించింది.
సొంత మేనమామనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!
“తెలుగులో నేను చేసిన ఓ చిత్రంలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రోమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు, కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు” అంటూ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆ కథలో కనిపించిన పురుషాధిక్య ధోరణి (Patriarchal Situation) తనకు నచ్చలేదని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో నటించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని, కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పాత్రల్లో అదొకటని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి
ఆమె ఏ సినిమా పేరును డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినప్పటికీ, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ (2014) గురించే ఈ వ్యాఖ్యలని అందరికీ అర్థమైపోయింది.
చనిపోయిన హీరోయిన్ను భుజాలపై మోసే సీన్ కూడా కష్టమే!
ఈ సినిమాలో తనకు ఎదురైన మరో కష్టమైన సన్నివేశాన్ని కూడా రాధికా గుర్తుచేసుకుంది. కథ మధ్యలో తన పాత్ర చనిపోతుందని, ఆ తర్వాత హీరో తన మృతదేహాన్ని భుజాలపై వేసుకుని యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనే సన్నివేశం ఉంటుందని చెప్పింది. ఆ సీన్ చేయడం కూడా తనకు చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించింది.
‘లెజెండ్’తో బాలయ్యకు భారీ విజయం
2014లో విడుదలైన ‘లెజెండ్’ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, రాధికా ఆప్టే కథానాయికల్లో ఒకరిగా నటించింది. భారీ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తెలుగు సినిమా పరిశ్రమపై గతంలోనూ విమర్శలు
రాధికా ఆప్టే తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2024లో ఆమె మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ అయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పురుషాధిక్య ధోరణి ఎక్కువగా ఉంటుందని, సినిమా సెట్స్‌లో మహిళలతో వ్యవహరించే తీరు గురించి కూడా ఆమె గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరి అలాంటి పాత్రలు ఎందుకు అంగీకరించినట్లు?
రాధికా తాజా వ్యాఖ్యలతో మరోసారి తెలుగు సినీ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. ఒక సినిమాలోని పాత్ర నచ్చకపోతే, లేదా కథలోని అంశాలు అసౌకర్యంగా అనిపిస్తే.. ఆ సినిమా అంగీకరించే ముందే ఆలోచించవచ్చు కదా? షూటింగ్ సమయంలోనే అభ్యంతరాలు చెప్పవచ్చు కదా? అనే ప్రశ్నలు కొందరు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
మరోవైపు, ఒక నటికి తనకు నచ్చని పాత్ర గురించి, ఎదురైన అనుభవాల గురించి ఎప్పుడైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్చలు వచ్చినప్పుడే సినిమాల్లో మహిళా పాత్రల రూపకల్పనపై దర్శకులు, రచయితలు మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్‌తో కలిసి రాధికా ఆప్టే నటించిన ‘అక్కా’ వెబ్ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్ల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి టాలీవుడ్లో చర్చకు దారితీశాయి. మొత్తానికి ‘లెజెండ్’ సినిమా పదేళ్లకు పైగా గడిచినా, అందులోని పాత్రల గురించి ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







