ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మురసు తుపాను..!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురసు’(Murusu Cyclone) ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. ‘అర్నబ్’ తుపాను సృష్టించిన నష్టం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోకముందే, వారం వ్యవధిలోనే మరో తీవ్ర విపత్తు విరుచుకుపడటంతో తీర ప్రాంత జిల్లాలు జలమయమయ్యాయి. తుపాను ప్రభావంతో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వాతావరణ శాఖ అత్యంత ప్రభావిత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ తుపాను దాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా పొన్నూరులో 31.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో సైతం ఏకంగా 30 సెంటీమీటర్ల కుంభవృష్టి కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు డివిజన్లు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు పడటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
మరోవైపు తీర ప్రాంత జిల్లాలైన బాపట్లలో 15.7 సెం.మీ., చీరాలలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో 14.5 సెం.మీ. కుండపోత కురవగా, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోనూ వర్షం జోరు తగ్గలేదు. ఏలూరులో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి, పత్తి, ఉద్యాన పంటలు నీట మునిగిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.
అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో వందలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా గ్రేటర్ విశాఖపట్నం సహా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. బాధితుల కోసం సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు పది వేల మందికి పైగా ప్రజలను తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.







