టాలీవుడ్లో మళ్లీ ప్రేమకథల హవా రావాల్సిందేనా?
తెలుగు సినిమా ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు, యాక్షన్ డ్రామాలు, పాన్ ఇండియా కథాంశాల చుట్టూ తిరుగుతోంది. అయితే ఈ క్రమంలో ఒకప్పుడు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ప్యూర్ లవ్ స్టోరీలకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఇటీవల హీరో నాని(nani) చేసిన కామెంట్స్ ఈ అంశంపై మరోసారి డిస్కషన్ కు తెరలేపాయి. ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కూడా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించి, భారీ సినిమాల రికార్డులను అధిగమించాలని ఆయన ఆకాంక్షించారు. నిజానికి ఒకప్పుడు ఖుషి(Kushi), నువ్వు నేను(Nuvvu Nenu), బొమ్మరిల్లు(Bommarillu), డార్లింగ్(Darling), ఏ మాయ చేశావే(Ye maya chesave) వంటి సినిమాలు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాయి. సాంగ్స్, లవ్ సీన్స్, నేచురల్ ఎమోషన్స్ తో ఈ సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.
ప్రస్తుతం స్టార్ హీరోలంతా భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటున్నారు. పెరుగుతున్న నిర్మాణ వ్యయం, బాక్సాఫీస్ అంచనాలు కూడా నిర్మాతలను ప్రయోగాలకు దూరం చేస్తున్నాయి. అయితే ఆడియన్స్ కు ప్రేమకథలపై ఆసక్తి తగ్గిందని చెప్పడానికి ఆధారాలు లేవు. మలయాళంలో వచ్చిన ప్రేమలు వంటి సినిమాలు భాషా హద్దులను దాటి ఆదరణ పొందడం ఇందుకు నిదర్శనం. కథలో సహజత్వం, పాత్రల్లో నిజాయితీ ఉంటే చిన్న సినిమాలకూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇవి నిరూపించాయి.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్లో మళ్లీ ప్రేమకథల పునర్వైభవం రావాలంటే హీరోలు, దర్శకనిర్మాతలు తమ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. స్టార్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నాలు జరగాలి. నాని కోరుకున్నట్లు ఒక స్వచ్ఛమైన ప్రేమకథ రూ.300 కోట్ల మార్కును అందుకునే రోజు వస్తుందేమో చూడాలి.







