ఆర్టీజీఎస్ టెక్నాలజీతో ప్రాణనష్టం నివారించాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. వారం వ్యవధిలోనే ‘అర్నబ్’ మరియు ‘మురసు’ తుపాన్లు వరుసగా పంజా విసరడంతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే, విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సాంకేతికత అద్భుతంగా పనిచేసిందని, దీనివల్ల తుపాను ప్రభావాన్ని 90 శాతానికి పైగా ఖచ్చితంగా అంచనా వేసి ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రమాద సంకేతాలను ముందే గుర్తించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మానవీయ కోణంలో స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన దాదాపు 5,000 మంది గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా సురక్షితంగా ఆసుపత్రులకు తరలించి కాన్పుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
గతంలోనూ ఏపీ అనేక భారీ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసిన ఆయన, ఈ విపత్తు వేళ ప్రజలు కూడా ఎంతో బాధ్యతగా ముందడుగు వేసి ప్రభుత్వ యంత్రాంగానికి, తోటి బాధితులకు సహాయం అందించుకోవడం అభినందనీయమని కొనియాడారు. మరోవైపు, వరుస తుపాన్ల ధాటికి రాష్ట్రంలో విద్యుత్ రంగానికి భారీ నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
కుండపోత వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 31,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, 548 సబ్ స్టేషన్లలో సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 4,095 గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయని వివరించారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దేందుకు అదనపు సిబ్బందిని రంగంలోకి దించి యుద్ధప్రతిపాదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, మౌలిక వసతులు, పంట నష్టాలపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.






