స్థానిక ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగులు.. వంగవీటి రాధా నుంచి ముక్కా శ్రావణి వరకు.. కోట్లలో పందేలు..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే విషయంపై నాయకులు, కార్యకర్తలు లెక్కలు వేసుకుంటుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తమ పందేలతో హడావుడి చేస్తున్నారు. కేవలం పార్టీల గెలుపోటములపైనే కాకుండా, ఆయా ప్రాంతాల్లో కీలకంగా నిలిచిన అభ్యర్థుల వ్యక్తిగత విజయాలపైనా భారీ మొత్తంలో డబ్బులు పందెం కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవహారం కోట్ల రూపాయలకు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు (Akividu) ప్రాంతంలో వ్యక్తిగత అభ్యర్థుల గెలుపుపై సుమారు కోటి రూపాయల వరకు బెట్టింగులు జరిగినట్లు పోలీసుల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అయితే ఈ పందేల వెనుక ఎవరున్నారు? ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరు పెట్టుబడిగా పెడుతున్నారు? అనే విషయాలు మాత్రం స్పష్టంగా బయటకు రావడం లేదు. స్థానిక నాయకులతో పాటు రాజకీయ పార్టీల బలాబలాలను బట్టి కూడా పందేలు సాగుతున్నట్లు సమాచారం.
విజయవాడ (Vijayawada) మున్సిపల్ రాజకీయాలపై జరుగుతున్న బెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడ జనసేన తరఫున వంగవీటి రాధా (Vangaveeti Radha) మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలవడం ఆసక్తిని పెంచింది. ఆయనకు పోటీగా మాజీ ఐపీఎస్ అధికారి ఏవీ వెంకటేశ్వరరావు (AV Venkateswara Rao) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి (Rayana Bhagyalakshmi) కూడా పోటీలో నిలిచి తన బలాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ రాధా విజయంపై ఎక్కువ మంది పందేలు కాస్తున్నట్లు బెజవాడ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ నేపథ్యం ఈ నమ్మకానికి కారణమని పలువురు భావిస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్త ఏకంగా రూ.2 కోట్ల వరకు ఆయన గెలుపుపై పందెం కాసేందుకు సిద్ధమైనట్లు కూడా ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఇక విశాఖపట్నం (Visakhapatnam) కార్పొరేషన్ పరిధిలోనూ బెట్టింగుల జోరు పెరిగినట్లు తెలుస్తోంది. కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి (Mukka Sravani), వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి (Varudu Kalyani) మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో కల్యాణి కూడా దూకుడుగా వ్యవహరించి పలు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరోవైపు కూటమి నేతలంతా శ్రావణికి మద్దతుగా నిలిచారు. చివరి దశలో ఎంపీ శ్రీభరత్ (Sri Bharat) చేసిన సమన్వయ ప్రయత్నాలు కూటమి శ్రేణులను ఏకం చేయడంలో కీలకంగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పోలింగ్ శాతం 55 శాతానికి కూడా చేరకపోవడం అభ్యర్థుల్లో ఉత్కంఠను పెంచింది. తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో రెండు ప్రాంతాల్లోనూ గెలుపోటములపై భిన్నమైన అంచనాలు వినిపిస్తున్నాయి. విజయం సాధించినా స్వల్ప మెజారిటీతోనే అభ్యర్థులు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.
తిరుపతి (Tirupati) కార్పొరేషన్ పరిధిలోనూ ఇదే తరహా పందేలు జరుగుతున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య పోటీ ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపుపై రహస్యంగా భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, పార్టీల బలం, కూటమి సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బెట్టింగులు కడుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి సహజమే. అయితే రాజకీయ అంచనాలను ఆధారంగా చేసుకుని లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పందేలు సాగుతున్నాయనే వార్తలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఓటర్లు ఎవరికి మద్దతిచ్చారు? బెట్టింగ్ రాయుళ్ల అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి? అన్నది ఫలితాలు వెల్లడైన తర్వాతే తేలనుంది. అప్పటివరకు ఈ బెట్టింగుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే కొనసాగే అవకాశం ఉంది.







