ఢిల్లీలో రేవంత్ రెడ్డి పొలిటికల్ పవర్ షో!
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ‘ఇండియా’ కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీ జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన ఈ మహా ప్రదర్శనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సుదూర ప్రాంతమైన తెలంగాణ నుంచి వేల సంఖ్యలో శ్రేణులను ఢిల్లీకి తరలించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం స్పష్టంగా కనిపించింది. ఈ ఈవెంట్ కేవలం ఒక నిరసన సభగా మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి రాజకీయ సత్తాను నిరూపించే వేదికగా మారింది.
ఢిల్లీకి పెద్ద ఎత్తున వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో రైళ్లను కేటాయించేందుకు కేంద్రం నిరాకరించడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహపరిచాయి. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఈ మొత్తం ప్రణాళికను స్వయంగా పర్యవేక్షించారు. వందలాది స్లీపర్ బస్సులు, ప్రైవేటు వాహనాలు, విమానాల ద్వారా దాదాపు 8,000 మందికి పైగా కేడర్‌ను ఢిల్లీకి చేర్చి, తెలంగాణ కాంగ్రెస్ పవర్ ఏంటో నిరూపించారు. వేదికపై ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం తీరుపై రేవంత్ సంధించిన అస్త్రాలు కాంగ్రెస్ హైకమాండ్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి
భారీ జన సమీకరణతో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వద్ద రేవంత్ రెడ్డి ఇమేజ్ మరోసారి బలపడింది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, ఇంత దూర ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున కేడర్ ను తరలించడం ఆయన సత్తాకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పటికే ఏఐసీసీ నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, ఈ సభ ద్వారా ‘సౌతిండియన్ స్టార్ లీడర్’గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన రేవంత్‌పై రాహుల్ గాంధీకి ఉన్న నమ్మకం ఈ విజయంతో మరింత రెట్టింపైంది.
జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రాభవం పెరగడం రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల బి ఫారాల జారీ వంటి కీలక విషయాలలో ఇకపై ఆయనదే తుది నిర్ణయం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైకమాండ్‌లో తిరుగులేని పట్టు సాధించడం ద్వారా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాలకు, ప్రతిపక్షాలకు ఆయన గట్టి సందేశం పంపినట్లయింది. రేవంత్ వ్యతిరేకులు ఇకపై ఆయనను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.







