బొండపల్లి జెడ్పీటీసీ పోరు, బొత్స ఫ్యామిలీ కష్టమే..?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా చలామణి అవుతున్న బొత్స కుటుంబ ఆధిపత్యానికి షాక్ తప్పదా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన తరుణంలో కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తన కుటుంబాన్ని రంగంలోకి దించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో తన రాజకీయ వారసురాలు బొత్స అనూష భీమిలి ఇంచార్జ్ గా ఉండగా ఆమెను గజపతినగరం నియోజకవర్గం బొండపల్లిలో జెడ్పీటీసీ(ZPTC) అభ్యర్ధిగా నిలబెట్టడంతో పార్టీ కార్యకర్తలు సైతం షాక్ అయ్యారు.
తప్పని పరిస్థితిలో తన వారసురాలిగా బొత్స అనూషను స్థానిక ఎన్నికల బరిలోకి తెచ్చారనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు పూర్తి స్థాయి కార్యాచరణతో తెలుగుదేశం పార్టీ తరఫున పాశల నీరజ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటే, మరోవైపు కేవలం కుటుంబ పేరునే నమ్ముకుని వచ్చిన బొత్స అనూష ఎన్నికల బరిలో నిలిచారని టీడీపీ ఆరోపిస్తోంది. సమీప గ్రామాల్లో ప్రచార సరళిని గమనిస్తే, కనీసం ఓటర్లను నేరుగా కలిసి మాట్లాడేందుకు కూడా బొత్స అనూష పెద్దగా ఆసక్తి చూపకపోవడం స్థానిక క్యాడర్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు టీడీపీ అభ్యర్థి పాశల నీరజ తరుపున కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) సైతం ఈ అంశాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతో మండలంలో రాజకీయం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సంచలనమైంది. టీడీపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో వైసీపీ వెనుకబడిందనే అభిప్రాయాలు బలంగా వినపడుతుంది. ప్రముఖ నేత కుమార్తె బరిలో ఉన్నా, వైసీపీ క్యాడర్ లో ఐఖ్యత లేకపోవడంతో బొత్సా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారింది అంటున్నాయి రాజకీయ వర్గాలు.







