జేమ్స్ బాండ్ చేతికి కొత్త వాచ్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
“బాండ్.. జేమ్స్ బాండ్!”
ఈ ఒక్క డైలాగ్ చాలు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి!
స్టైలిష్ సూట్, చేతిలో గన్, అత్యాధునిక గాడ్జెట్లు, వేగంగా దూసుకెళ్లే లగ్జరీ కార్లు.. జేమ్స్ బాండ్ కనిపిస్తే ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ, బాండ్ ఉపయోగించే ప్రతి వస్తువు వెనుకా ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయన చేతికి ఉండే వాచ్ దగ్గర నుంచి నడిపే కారు వరకు ప్రతి వస్తువుపైనా అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. బాండ్ సినిమాలో కనిపించిన వస్తువులకు కూడా ప్రత్యేక గుర్తింపు, మార్కెట్లో క్రేజ్ ఏర్పడుతుంటాయి.
ముఖ్యంగా బాండ్ వాచ్ అంటే అభిమానులకు మరింత ఆసక్తి. ఎందుకంటే అది కేవలం టైమ్ చూసుకునే పరికరం కాదు.. బాండ్ స్టైల్‌కు, వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు. ఇన్నాళ్లూ జేమ్స్ బాండ్‌తో ఎక్కువగా వినిపించిన పేరు ఓమెగా (Omega). అయితే ఇప్పుడు బాండ్ చేతికి రాబోతున్న కొత్త వాచ్ గురించి తెలిసిన విషయం ఆసక్తిని పెంచుతోంది. అది అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఖరీదైన వాచ్ కాదు. ఏకంగా రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన పాతకాలపు మిలిటరీ వాచ్!
అసలు ఆ వాచ్ ప్రత్యేకత ఏమిటి? దానికి యుద్ధంతో ఉన్న సంబంధం ఏంటి? జేమ్స్ బాండ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత గూఢచారి కోసం రచయిత ఈ వాచ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
ఓమెగా కాదు.. ఈసారి బాండ్ చేతికి యుద్ధకాలపు వాచ్!
నెక్ట్స్ జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారనే చర్చ ఇంకా పూర్తి కాలేదు. అదే సమయంలో, చార్లీ హిగ్సన్ రాసిన కొత్త జేమ్స్ బాండ్ నవల King Zeroలో 007 ధరించే వాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నవలలో 35 ఏళ్ల వయసున్న బాండ్ చేతికి Vertex Cal. 59 అనే పాతకాలపు వాచ్ ఉంటుంది.
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. ఈ వాచ్‌ను బాండ్ కొత్తగా కొనుక్కోడు. తన పెద్ద ముత్తాత సోదరుడి నుంచి వారసత్వంగా పొందుతాడు. ఆయన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలోని 6వ ఎయిర్‌బోర్న్ డివిజన్లో పనిచేశారు. డీ-డే ఆపరేషన్ సమయంలో పెగాసస్ బ్రిడ్జ్ వద్ద జరిగిన సైనిక కార్యకలాపాలతో ఆయనకు సంబంధం ఉంది.
అంటే, బాండ్ చేతికి వచ్చినది ఒక పాత వాచ్ మాత్రమే కాదు. ఒక కుటుంబ చరిత్రకు, యుద్ధ జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచే వస్తువు. అందుకే ఈ వాచ్‌కు కథలో ప్రత్యేక స్థానం కల్పించారు.
ఈ వాచ్‌లో అంత స్పెషల్ ఏముంది?
సాధారణంగా ఖరీదైన వాచ్ అనగానే మనకు బంగారం, వజ్రాలు, విలాసవంతమైన డిజైన్ గుర్తుకొస్తాయి. కానీ ఈ వాచ్ గొప్పతనం దాని అలంకారంలో లేదు. యుద్ధ సమయంలోనూ నమ్మకంగా పనిచేసేలా రూపొందించడంలో ఉంది.
1940ల కాలంలో సైనికులకు సమయం చాలా కీలకం. ఒక ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు ఒక ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలి? ఇతర సైనికులతో సమన్వయం ఎలా చేసుకోవాలి? ఇలాంటి నిర్ణయాల్లో కొన్ని నిమిషాల తేడా కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే అప్పటి మిలిటరీ వాచీలు అందంగా కనిపించడం కంటే, కఠినమైన పరిస్థితుల్లోనూ పనిచేయడం ముఖ్యం.
Vertex Cal. 59కు సంబంధించిన యుద్ధకాలపు వాచ్‌లో నీటిని తట్టుకునే సామర్థ్యం, దెబ్బలను తట్టుకునే నిర్మాణం, చీకటిలో సమయం కనిపించేలా చేసే ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే, చీకటిలోనూ సమయం చూడగలగడం నుంచి యుద్ధ వాతావరణంలోనూ పనిచేయడం వరకు సైనికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని తయారు చేశారు.
ఈ వాచ్ గురించి Vertex సంస్థ యజమాని డాన్ కోక్రేన్ ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. యుద్ధ సమయంలో సమయాన్ని తప్పుగా అంచనా వేయడం అంటే కేవలం రైలును మిస్ కావడం లాంటిది కాదని, కొన్ని సందర్భాల్లో అది ప్రాణాలకే ప్రమాదమని ఆయన వివరించారు. అందుకే ఈ తరహా వాచీలను తొలి నిజమైన ‘టూల్ వాచ్’లలో ఒకటిగా అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి
‘డర్టీ డజన్’ అంటే ఏమిటి?
ఈ వాచ్ కథలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం ప్రత్యేకంగా వాచీలు తయారు చేయడానికి 12 సంస్థలను ఎంపిక చేసింది. ఈ సంస్థలను కలిపి ‘డర్టీ డజన్’ (Dirty Dozen) అని పిలుస్తారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బ్రిటిష్ వాచ్‌మేకర్ Vertex.
1912లో ప్రారంభమైన ఈ సంస్థ, యుద్ధకాలపు అవసరాలకు అనుగుణంగా వాచీలను తయారు చేసింది. అప్పటి మిలిటరీ వాచ్‌లలో ఉపయోగించిన సాంకేతికత, వాటి దృఢత్వం, పనితీరు నేటికీ వాచ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ఇక్కడే జేమ్స్ బాండ్ పాత్రకు ఈ వాచ్‌ను ఎంచుకోవడంలోని ప్రత్యేకత అర్థమవుతుంది. సాధారణంగా బాండ్‌కు అత్యాధునిక గాడ్జెట్లు ఉంటాయి. కానీ ఈసారి అతని చేతికి వచ్చిన వాచ్ గతంలో యుద్ధరంగంలో పనిచేసిన సైనికుల అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఆధునిక గూఢచారి చేతికి చరిత్రను మోసుకొచ్చే వస్తువు రావడం కథకు మరో కోణాన్ని జోడిస్తుంది.
బాండ్ చేతికి ఈ వాచ్ ఎలా వచ్చింది?
Vertex సంస్థను 1912లో స్థాపించారు. కాలక్రమంలో సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, దాని యజమాని డాన్ కోక్రేన్ 2016లో దాన్ని తిరిగి ప్రారంభించారు. తన ముత్తాత స్థాపించిన సంస్థకు మళ్లీ ప్రాణం పోశారు.
అయితే, తమ సంస్థకు చెందిన వాచ్ జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించబోతోందనే విషయం తనకు ముందుగా తెలియదని కోక్రేన్ వెల్లడించారు. King Zero ప్రచురణకర్తల నుంచి సమాచారం అందినప్పుడే ఈ విషయం తెలిసిందని చెప్పారు. బాండ్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాత్రలో తమ వాచ్‌కు స్థానం దక్కడం, సంస్థను తిరిగి ప్రారంభించినప్పుడు ఊహించని గౌరవమని ఆయన పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక వాచ్ కంపెనీకి లభించిన ప్రచారం మాత్రమే కాదు. పాతకాలపు మిలిటరీ వాచ్లకు ఉన్న చారిత్రక విలువను కొత్త తరం పాఠకులకు పరిచయం చేసే అవకాశంగా కూడా చూడవచ్చు అని అన్నారు.
బాండ్ వాచ్ అంటే కేవలం ఫ్యాషన్ కాదు.. ఒక కథ!
జేమ్స్ బాండ్ సినిమాల విజయానికి యాక్షన్, గూఢచర్యం, విలన్లు, గాడ్జెట్లు ఎంత ముఖ్యమో.. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చిన్న చిన్న వస్తువులు కూడా అంతే ముఖ్యం. ఆయన ధరించే సూట్, వాడే కారు, చేతికి ఉండే వాచ్.. ఇవన్నీ కలిసి బాండ్ అనే బ్రాండ్‌ను నిర్మిస్తాయి.
ఈసారి King Zeroలో ఎంపిక చేసిన Vertex వాచ్ కూడా అదే పని చేస్తుంది. దాని వెనుక యుద్ధ చరిత్ర ఉంది. ఒక కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. సమయాన్ని కచ్చితంగా పాటించాల్సిన సైనికుల అవసరాలు ఉన్నాయి. ఈ నేపథ్యం వల్లే అది బాండ్ చేతికి సరిపోయే వస్తువుగా మారింది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ వివరాలు చార్లీ హిగ్సన్ రాసిన King Zero నవలకు సంబంధించినవి. తదుపరి జేమ్స్ బాండ్ సినిమాలోనూ ఇదే వాచ్ కనిపిస్తుందని ఇంకా నిర్ధారణ కాలేదు.
King Zero కథేంటి?
జేమ్స్ బాండ్‌పై చార్లీ హిగ్సన్ రాసిన కొత్త నవల King Zero. ఈ నవల ఆథారంగా ఈ సినిమా రుపొందుతోందని కన్ఫర్మేషన్ అయితే లేదు. 2026 సెప్టెంబర్ 24న బ్రిటన్‌లో విడుదలైన ఈ నవలలో బాండ్ వయసు 35 ఏళ్లు. దీని కథ ఆధునిక ప్రపంచంలో సాగే గూఢచర్యం, ద్రోహం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్త కుట్ర చుట్టూ తిరుగుతుంది.
కథ ప్రారంభంలో సౌదీ అరేబియా ఎడారిలో ఒక బ్రిటిష్ గూఢచారి హత్యకు గురవుతాడు. అతడిని చంపడానికి ఉపయోగించిన ఆయుధం బ్రిటిష్ రహస్య విభాగానికి కూడా కొత్తదే. అంతేకాదు, ఆ ఏజెంట్ కదలికలు, అతడి కార్యకలాపాల గురించి లోపలి వ్యక్తికి మాత్రమే తెలిసే సమాచారం హంతకుడికి అందినట్లు అనుమానాలు కలుగుతాయి.
అంటే ఇది సాధారణ హత్య కాదు. బ్రిటిష్ రహస్య విభాగంలోనే ఎవరో ద్రోహానికి పాల్పడ్డారా? ఆ ఏజెంట్‌ను చంపడానికి కారణమైన రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి జేమ్స్ బాండ్ రంగంలోకి దిగుతాడు. అయితే, అతడు దర్యాప్తు ప్రారంభించే సమయానికే మరింత పెద్ద ప్రమాదానికి కౌంట్‌డౌన్ మొదలై ఉంటుంది.
బాండ్ ఎదుర్కొనే అసలు ప్రమాదం ఏమిటి?
బాండ్ దర్యాప్తు సౌదీ అరేబియాతోనే ఆగిపోదు. కథ అతడిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో సాంకేతికత, అంతర్జాతీయ రాజకీయాలు, వనరులపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ వెనుక ఉన్న పెద్ద కుట్ర బయటపడుతుంది.
ఈ కుట్రకు కేంద్రంగా ‘కింగ్ జీరో’ (King Zero) అనే శక్తిమంతమైన వ్యక్తి ఉంటాడు. అతడి అసలు లక్ష్యం ఏమిటి? అతడికి ఎంత అధికారం ఉంది? అతడిని ఎదుర్కోవడం బాండ్‌కు ఎందుకు అంత కష్టంగా మారుతుంది? ఇవే కథలో ప్రధాన ఉత్కంఠను సృష్టించే అంశాలు.








