పెట్టుబడులకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్ : భట్టి విక్రమార్క
పెట్టుబడులకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్ (Hyderabad)ను తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) అన్నారు. పోచారంలో ఇన్ఫోసిస్ ( Infosys) అభివృద్ధి కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇన్ఫోసిస్ విస్తరణ ద్వారా హైదరాబాద్ పై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. 48 వేల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ కొత్త అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ద్వారా ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కేంద్రంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులకు ఐటీ రంగంలో ప్రాధాన్యం లభించనుందని వివరించారు. యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ఇన్నోసిస్ సంస్థ అందించాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇన్ఫోసిస్ 59 దేశాల్లో సేవలు అందిస్తుందని, హైదరాబాద్‌లో 25 ఏళ్లు క్రితం పోచారంలో ఈ సంస్థ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. పోచారం(Pocharam)లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రం ద్వారా 23 వేల మందికి నేరుగా, 13 వేల మందికి హైబ్రిడ్ పద్ధతిలో ఉద్యోగాలిస్తామన్నారు.








