బలవంతుడు చెప్పేదాన్ని ప్రపంచం వింటుంది.. కిమ్ శాంతి సందేశం..!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్.. ప్రపంచ రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, సంక్లిష్టపరిస్థితులకు సంబంధించి పరోక్షంగా స్పందించారు. శాంతి అనేది ఆయుధంతోనే వస్తుందన్నారు కిమ్. బలవంతుడు చెప్పేదాన్ని ప్రపంచం వింటుందని… శాంతి కూడా సాధ్యమవుతుందన్నారు. అందుకే కిమ్.. అణ్వాయుధ రేసులో ఎప్పుడు దేశాన్ని ముందుంచాలని చూస్తారు కూడా.
ఉత్తరకొరియా ఎప్పటికప్పుడు తన రక్షణ సామర్థ్యాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటుంది. ఆయుధాల తయారీలో కిమ్ ప్రభుత్వం కృత్రిమ మేధను విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతను వినియోగించిన ఆయుధాలతో పాటు తొలిసారి 600 మి.మీ. ‘స్నైపర్’ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను ఆవిష్కరించి.. లైవ్ ఫైరింగ్‌ను నిర్వహించింది. ఈ ఆయుధ ప్రదర్శనను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) దగ్గరుండి పర్యవేక్షించారు.
శత్రుస్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం ఉండటంతో ఈ లాంచర్‌ను ఉత్తర కొరియా (North Korea) స్నైపర్‌గా పిలుస్తోంది. ఇది నిర్దేశిత లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో తాకుతుందని ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. కిమ్ ప్రభుత్వం దీనిని సరిహద్దులో మోహరిస్తే.. దక్షిణ కొరియా మొత్తం దీని పరిధిలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఆయుధాల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను ఉ.కొరియా మీడియా విడుదల చేసింది.
10కిపైగా స్నైపర్లు ఏకకాలంలో ఫైరింగ్ చేయడం, డ్రోన్ల నుంచి క్షిపణులను ప్రయోగించడం, దక్షిణ కొరియా పోస్టులు, అమెరికా అబ్రహాం ట్యాంకుల ప్రతీకలను ఏర్పాటు చేసి వాటిపై ఆత్మాహుతి డ్రోన్లు దాడి చేయడం ఆ దృశ్యాల్లో కనిపించింది. డ్రోన్ టెక్నాలజీలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఈ ప్రదర్శన సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) బలగాలకు పిలుపునిచ్చారు. శాంతికి భరోసా కేవలం బలంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.








