మియాపూర్ భూములను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి (Serilingampally) రెవెన్యూ మండలంలోని మియాపూర్ (Miyapur) సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సుమారు 550 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీన ప్రక్రియను అధికారులు శరవేగంగా ప్రారంభించారు. రూ.వేల కోట్ల విలువైన ఈ భూములను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy), వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 400 ఎకరాలకు ఇప్పటికే ఫెన్సింగ్ ఉందని, మిగిలిన భూమికి ఫెన్సింగ్ వేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. 1995 నాటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు (ఎల్జీసీ) నుంచి దాదాపు ముప్పై ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ వివాదానికి సుప్రీంకోర్టు (Supreme Court) చరిత్రాత్మక తీర్పుతో శాశ్వతంగా తెరపడింది. సంపూర్ణంగా ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పరిశీలన, స్వాధీన పర్యవేక్షణ చేపట్టారు.








