డెమోక్రాట్లు గెలిస్తే ఏక పార్టీ వ్యవస్థే..! అమెరికా పని అయిపోయినట్లే అంటున్న మస్క్..!
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ దిగ్గజ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని హెచ్చరించారు. అటువంటి ఎన్నికల ఫలితం అమెరికాలో ప్రధాన రాజకీయ, సంస్థాగత మార్పులకు దారితీయవచ్చని పేర్కొన్నారు. 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష పదవిని డెమోక్రాట్లు దక్కించుకుంటే వారు ఏం చేస్తారనే దానిపై మస్క్ తన ఆందోళనలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘2028లో జరిగే అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష పదవులను పూర్తిగా కైవసం చేసుకుంటే ..వారు సెనేట్లో బలమైన మెజారిటీని సాధించడానికి వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికోలను రాష్ట్రాలుగా మారుస్తారు. శాశ్వత మెజారిటీని పటిష్ఠం చేసుకోవడానికి సరిహద్దులను తెరిచి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరికి పౌరసత్వం లేదా చట్టబద్ధత కల్పిస్తారు. అమెరికా సుప్రీం కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను పెంచి తమకు అనుకూలమైన మెజారిటీని డెమోక్రాట్లు సంపాదించుకుంటారు. ఇదే నా ఆందోళన.
రాబోయే ఎన్నికల్లో డెమోక్రాట్లు క్లీన్ స్వీప్ చేస్తే అది ‘గేమ్ ఓవర్ ఫర్ అమెరికా’ (అమెరికా కథ ముగిసినట్లే) అవుతుంది’’ అని మస్క్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు అమెరికాను ఒకే ఒక్క పార్టీ పాలించే దేశంగా మారుస్తాయని ఆరోపించారు. అమెరికాలో ఇటువంటి పరిణామాలను అడ్డుకోవాలంటే రిపబ్లికన్లు సెనేట్లో 51 సీట్లను దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు రిపబ్లికన్ సెనేటర్లకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ ప్రచారాలు, రాజకీయ కార్యక్రమాలకు ఎలాన్ మస్క్ ఏకంగా 442 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. ఈ క్రమంలో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యక్తిగత రాజకీయ దాతగా ఈ బిలియనీర్ నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ విజయానికి మస్క్ ఆర్థికంగా సాయం చేశారు.








