దేశంలోనే ఫస్ట్..! పల్లెలకోసం తెలంగాణ పక్కా ప్లాన్!!
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్తుంటారు. అయితే, గ్రామాల అభివృద్ధికి ఇప్పటివరకు సరైన శాస్త్రీయ విధానం లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన, పక్కా ప్రణాళికతో కూడిన చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఐదేళ్ల కాలానికి ఒక సమగ్ర, శాస్త్రీయ ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ‘తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP) రూల్స్, 2026’ను నోటిఫై చేసింది. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక ప్రణాళికలు మరింత పకడ్బందీగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు.
మొదటి విభాగంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు, గతంలో చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును క్రోఢీకరిస్తారు. రెండో విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి మూడు నుంచి ఐదేళ్ల కాలానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు. ఇందులో గతేడాది ఆర్థిక వనరులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు అంచనా నిధుల్లో 125 శాతం వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక మూడో విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇందులో నెలవారీ ప్రగతిని అంచనా వేస్తారు.
ఈ ప్రణాళిక అమలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా నిబంధనలు రూపొందించారు. గ్రామ స్థాయిలో జీపీఎస్ఏపీ తయారీ, రికార్డుల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించి ప్రతి నెలా పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మండల స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గ్రామ స్థాయి కార్యకలాపాలను పర్యవేక్షించాలి. ప్రతి నెలా ప్రగతి నివేదికలను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమర్పించి జీపీఎస్ఏపీలో అప్డేట్ చేయించాలి. ప్రతి నెలా జరిగే గ్రామ పంచాయతీ సమావేశాలలో జీపీఎస్ఏపీనే మొదటి అజెండా అంశంగా చర్చించాలి. సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమీక్షా సమావేశాలకు అన్ని శాఖల గ్రామ స్థాయి సిబ్బంది హాజరుకావడం తప్పనిసరి చేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP), వికసిత్ గ్రామ్ పంచాయతీ ప్రణాళిక (VGPP) వంటి ఇతర కార్యక్రమాలను కూడా ఈ జీపీఎస్ఏపీతో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ లక్ష్యాలు సకాలంలో నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ శాస్త్రీయ ప్రణాళికా నిర్ణయం పల్లెసీమల రూపురేఖలను మార్చడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశించవచ్చు.








