ట్రంప్ బాటలోనే రామస్వామి.. గెలిస్తే వీసామోసాలు, శాంక్చురీ సిటీలపై ఉక్కుపాదం..!
అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేసి, తర్వాత తప్పుకున్న భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి(vivek ramaswamy).. ఒహాయో గవర్నర్ రేసులో ఉన్నారు. ట్రంప్ మద్దతుతో రేసులో దూసుకెళ్తున్న రామస్వామి…. గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై కీలక ప్రకటన చేశారు. తాను ఎన్నికైతే, అధికార బాధ్యతలు చేపట్టిన తొలిరోజే (జనవరి 11) ఏడు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వీసా మోసాలు, శాంక్చురీ సిటీలపై ఉక్కుపాదం మోపుతానని ఆయన స్పష్టం చేశారు.
వీసా ఫ్రాడ్తో పాటు మెడికెయిడ్, ప్రభుత్వ ప్రయోజనాలు, ఓటర్ రిజిస్ట్రేషన్లలో జరిగే మోసాలను అరికట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ నేరుగా గవర్నర్కు రిపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు సహకరించని ‘శాంక్చురీ సిటీలకు’ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే గ్రాంట్లను నిలిపివేస్తామని హెచ్చరించారు.
వీటితో పాటు కొత్త డేటా సెంటర్ల అనుమతులు తాత్కాలికంగా నిలిపివేయడం, మెడికెయిడ్ వ్యయాన్ని నియంత్రించడం, 2020 నుంచి 100 శాతం పైగా పెరిగిన ఆస్తి పన్నులపై విచారణ జరపడం వంటి మరికొన్ని ఆదేశాలు కూడా జారీ చేస్తానని హామీ ఇచ్చారు.
నవంబర్ 3న ఒహాయో గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్తో తలపడుతున్నారు. తాజా సర్వేల ప్రకారం, అమీ యాక్టన్ 48 శాతం మద్దతుతో ముందంజలో ఉండగా, వివేక్ రామస్వామి 45 శాతం ఓట్లతో స్వల్పంగా వెనుకబడ్డారు. దీంతో ఇరువురి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది








