బీఆర్ నాయుడు తర్వాత టీటీడీ పగ్గాలు ఎవరికి? తెరపైకి కొత్త పేర్లు..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి చైర్మన్ ఎంపికపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు (B.R.Naidu) పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తిరుమల వంటి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం నిర్వహణకు సంబంధించిన పదవి కావడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త శ్రీనివాస రామానుజం (Srinivasa Ramanujam) పేరు చర్చల్లోకి వచ్చింది. ఆయన అసలు పేరు లోకాద్రి నాయుడు అని, వ్యాపార రంగంలో దేశీయంగా, విదేశాల్లో గుర్తింపు పొందారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ స్థాయి నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) సమక్షంలో రామానుజ సంప్రదాయాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారనే అంశం కూడా ఆయన పేరును ఈ చర్చల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది. అయితే ఆయన నియామకంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు (Kimidi Kala Venkata Rao) పేరు వినిపిస్తుండగా, జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) పేరు కూడా చర్చకు వస్తోంది. పార్టీకి అందించిన సేవలు, రాజకీయ అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు వంటి అంశాలు నియామకంలో కీలకంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొత్త పాలకమండలి ప్రకటనకు అడ్డంకిగా మారుతుందా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా స్పెసిఫైడ్ అథారిటీ (Specified Authority) ద్వారా టీటీడీ పరిపాలన కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. మరోవైపు ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేక కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.
టీటీడీ చైర్మన్ నియామకం కేవలం రాజకీయ పదవుల పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. తిరుమల పరిపాలన, భక్తులకు అందించే సౌకర్యాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలతో ముడిపడి ఉంది. అందువల్ల కొత్త చైర్మన్ ఎంపికపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో ఉన్న పేర్లకు భిన్నంగా కొత్త వ్యక్తి తెరపైకి వస్తారా? లేక ఇప్పటికే వినిపిస్తున్న పేర్లలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా? అనేది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తేలనుంది.








