ఎన్నికల సిబ్బందికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైన వేళ, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల డ్యూటీలు నిర్వహించే సిబ్బందికి ఇచ్చే పారితోషికాన్ని కేటగిరీల వారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న పారితోషికాల రేట్లలో మార్పులు చేస్తూ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1345 ద్వారా ట్రైనింగ్ క్లాసులు, పోలింగ్, కౌంటింగ్ విధుల్లో పాల్గొనే జోనల్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (APPO), పోలింగ్ అధికారులు (OPO) మరియు క్లాస్-IV సిబ్బందికి పెరిగిన కొత్త రేట్ల ప్రకారం భత్యాలు అందనున్నాయి.
పారితోషికం పెంపుతో పాటు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. విధి నిర్వహణలో అనుకోకుండా ప్రమాదాలకు గురయ్యే ఎన్నికల సిబ్బందికి చెల్లించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని కూడా సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జీవో నంబర్ 1346 ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల విధుల్లో ఉండగా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి సిబ్బంది శాశ్వత వైకల్యానికి గురైనా, లేదా మరణించినా వారి కుటుంబాలకు అందించే నష్టపరిహారం మొత్తంలో కీలక మార్పులు చేస్తూ నిబంధనలను సవరించారు.
మున్సిపల్ ఎన్నికల విధుల కోసం విద్యాశాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వేలాది మంది సిబ్బందిని ఎన్నికల సంఘం ఇప్పటికే మోహరించింది. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి పంపిణీ చేసే ప్యాక్డ్ లంచ్, రిఫ్రెష్మెంట్ అలవెన్సులను కూడా ఈ ఉత్తర్వుల ద్వారా క్రమబద్ధీకరించారు. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆర్థికంగా ఊరటనిస్తూ, అదే సమయంలో ప్రమాదాల వేళ భరోసానిచ్చేలా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.








