ఏపీకి మరో ముప్పు.. బలపడుతున్న వాయుగుండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి వణికించేందుకు సిద్ధమవుతోంది. రాగల 12 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా (Deep Depression) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత ఇది మరింత తీవ్రరూపం దాల్చి తుపానుగా (Cyclone) మారనుంది. ఈ తుపాను గనుక సంభవిస్తే దీనికి మాల్దీవులు ప్రతిపాదించిన ‘మురసు’ (Murasu) అనే పేరును పెట్టనున్నారు. అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే ఈ కొత్త విపత్తు పొంచి ఉండటంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం నవంబర్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం తీవ్రంగా అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
కొత్త తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యాయి. తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. జలాశయాల నీటిమట్టాలను పర్యవేక్షించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంపై జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సహాయక బృందాలను కూడా ముందస్తుగా మోహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.








