భారత్ పై 25శాతం సుంకాలు… మరోసారి ట్రంప్ కొరడా..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ కొరఢా బయటకు తీశారు. 14 దేశాలపై సుంకాల బాదుడు ప్రతిపాదించారు. వీటిలో మనతో పాటు చైనా, జపాన్ సహా పలుదేశాలున్నాయి.ముఖ్యంగా..మన దేశ సరకులపై 25 శాతం టారిఫ్లను ప్రతిపాదించారు.. దేశీయంగా అవసరమైన వాటికన్నా అధికంగా వస్తువులను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో కుమ్మరిస్తూ.. తమ కంపెనీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందుకే ఈ చర్యకు ఉపక్రమించినట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) జేమీసన్ గ్రీర్ తెలిపారు.
తమ దేశంతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మాత్రం సుంకాలను 17 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. మనతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, బంగ్లాదేశ్ వంటి మొత్తం 14 ఆర్థిక వ్యవస్థలపై యూఎస్టీఆర్ కొత్త టారిఫ్లను ప్రతిపాదించారు. వీటిపై అమెరికా పౌరులు యూఎస్టీఆర్కు జనవరి 5లోగా రాతపూర్వకంగా అభిప్రాయాలు తెలపొచ్చు. జనవరి 25న బహిరంగ విచారణ కూడా నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని సర్కారు ప్రతిపాదించిన భారీ సుంకాలను ఆ దేశ సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టివేసింది. ఆపై- మిగులు ఉత్పత్తులతో అమెరికా కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ.. సెక్షన్ 301 కింద 16 ఆర్థిక వ్యవస్థలపై (భారత్, చైనా, ఈయూ, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, థాయ్లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, జపాన్, నార్వే, మెక్సికో) యూఎస్టీఆర్ మార్చిలో దర్యాప్తు ప్రారంభించారు. వాటి అధిక ఉత్పత్తుల వల్ల ధరలు తగ్గి తమ దేశంపై ప్రతికూల ప్రభావం పడుతోందో లేదో నెలలపాటు విశ్లేషించారు. ఆ విశ్లేషణల ఆధారంగా.. మెక్సికో, నార్వే మినహా మిగిలినవాటిపై ప్రస్తుత సుంకాలను ప్రతిపాదించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.
‘‘మా వాణిజ్య భాగస్వాముల్లోని చాలా దేశాలు దశాబ్దాలుగా పారిశ్రామిక ఉత్పత్తులను పెంచుకునే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. సబ్సిడీలు అందిస్తూ.. అవసరమైన వాటి కంటే ఎక్కువ సరకులను ఉత్పత్తి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోకి వాటిని చవకగా కుమ్మరిస్తున్నాయి. కార్మికులను అణచివేస్తున్నాయి. వారికి తగినంత వేతనాలు ఇవ్వడం లేదు. ఫలితంగా మార్కెట్లో సమతుల్యత దెబ్బతింటోంది. అమెరికా తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది’’ అని జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు. ఔషధాలు, ఉక్కు, ఐసీటీ గూడ్స్ వంటి రంగాల్లో భారత్ మిగులు ఉత్పత్తులను కలిగి ఉంటోందని తెలిపారు. తమతో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉండే దేశాలకు 15%-20% టారిఫ్లనే ప్రతిపాదించామని.. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాల కంటే ఇవి మరీ ఎక్కువేమీ కావని గ్రీర్ అన్నారు.
సుంకాల విషయంలో ఆసియాలోని బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా వంటి పోటీ దేశాల కంటే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండాలని.. అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో భారత్ దీర్ఘకాలంగా పట్టు పడుతోంది. తమతో ఒప్పందం చేసుకుంటే..బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్లపై 18 శాతం; చైనా, వియత్నాంలపై 20 శాతం సుంకాలనువాషింగ్టన్ ప్రస్తుతం ప్రతిపాదించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్లపై 15 శాతం టారిఫ్లను ప్రతిపాదించారు.
సరకులను మితిమీరి ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణను ఖండించిన భారత్… తమకు ఏ రంగంలోనూ వ్యవస్థాపక ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి లేదని స్పష్టం చేసింది. వాణిజ్య సంబంధిత అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. యూఎస్టీఆర్ ప్రతిపాదించిన నూతన సుంకాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.







