సీ బక్థార్న్ సీక్రెట్స్.. స్కిన్ గ్లో నుంచి ఇమ్యూనిటీ వరకు ప్రయోజనాలు!
స్కిన్ గ్లో నుంచి ఇమ్యూనిటీ వరకు.. వైరల్ సీ బక్థార్న్ సీక్రెట్స్..
ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారి మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు సీ బక్థార్న్ (Sea Buckthorn). ముఖ్యంగా సీ బక్థార్న్తో తయారయ్యే సి బక్థార్న్ టాబ్లెట్లు, జ్యూస్ గురించి చర్చ జరుగుతోంది. చర్మ సౌందర్యం నుంచి రోగనిరోధక శక్తి వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో పెరిగే ఈ నారింజ రంగు పండ్లలో అనేక పోషకాలు ఉండటం వల్ల వీటిని సూపర్‌ఫుడ్‌గా (Superfood) పిలుస్తున్నారు. అయితే అసలు ఈ పండు ప్రత్యేకత ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుందాం.
హిమాలయాల్లో పెరిగే సీ బక్థార్న్లోని ప్రత్యేక పోషకాలు
హిమాలయాల్లోని లడఖ్ (Ladakh), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. దీని పండ్లు నారింజ రంగులో చిన్న బెర్రీల (Berries) మాదిరిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి (Vitamin C), విటమిన్ ఇ (Vitamin E), యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ (Omega Fatty Acids) ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 7 (Omega-7) ఉండటం దీని ప్రత్యేకత.
సీ బక్థార్న్లో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థ (Immune System) సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అలాగే విటమిన్ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చర్మంలో తేమ నిలవడానికి, పొడిబారడం తగ్గించడానికి సీ బక్థార్న్ ఆయిల్ (Sea Buckthorn Oil)ను కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
జీర్ణక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల్లో కూడా ఈ పండ్లను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే గుండె జబ్బులు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులను నయం చేస్తుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు.
ఇవి కూడా చదవండి
జ్యూస్, పౌడర్, టాబ్లెట్ల రూపంలో ఎలా ఉపయోగించాలి?
సీ బక్థార్న్ను జ్యూస్, పౌడర్, ఎండిన పండ్లు, ఆయిల్, టాబ్లెట్ల రూపంలో ఉపయోగించవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవాలనుకుంటే ఉత్పత్తి సూచనల ప్రకారం కొద్దిగా పల్ప్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగవచ్చు. దీని రుచి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి అవసరమైతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. పౌడర్‌ను స్మూతీ లేదా ఇతర పానీయాల్లో కలుపుకోవచ్చు. టాబ్లెట్ల రూపంలో తీసుకునేటప్పుడు మాత్రం ప్యాక్‌పై ఉన్న సూచనలు, వైద్యుల సలహా పాటించాలి.
మార్కెట్లో లభించే సి బక్థార్న్ (Sea-Buckthorn) టాబ్లెట్లలో సీ బక్థార్న్ ఎక్స్‌ట్రాక్ట్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉత్పత్తిలో 1000 మి.గ్రా. సీ బక్థార్న్ ఎక్స్ట్రాక్ట్, 250 మి.గ్రా. విటమిన్ సి ఉన్నాయి. అయితే బ్రాండ్‌ను బట్టి ఈ మోతాదులు మారవచ్చు. అయితే అందరికీ ఇది సరిపోతుందని భావించకూడదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, రక్తం పలుచబడే మందులు లేదా రక్తపోటు, మధుమేహం మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోకూడదు. అసిడిటీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి కూడా కొన్ని ఉత్పత్తులు ఇబ్బంది కలిగించవచ్చు.
మొత్తానికి సీ బక్థార్న్ పోషకాలు కలిగిన ఒక ప్రత్యేకమైన పండు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వెంటనే టాబ్లెట్లు కొనడం కంటే, వాటి పదార్థాలు, నాణ్యత, మోతాదుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సమతుల్య ఆహారానికి అదనంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఎలాంటి అనారోగ్యానికైనా ఇది అద్భుతమైన మందు అని భావించకూడదు.







