ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రసిద్ధులు నరేందర్ జి. రెడ్డికి ‘‘‘జార్జియా అవుట్ స్టాండింగ్ సిటిజన్’’ అవార్డ్
ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రసిద్ధులు నరేందర్ జి. రెడ్డికి జార్జియా ప్రభుత్వం ‘‘జార్జియా అవుట్ స్టాండింగ్ సిటిజన్’’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ మేరకు జార్జియా సెక్రెటరీ బ్రాడ్ రాఫెన్స్ పెర్గర్ పేరుతో ఈ పురస్కారం ప్రదానమైంది. ఈ అవార్డు కారణంగా ఈ విశిష్ట పౌరుడు ఇతర రాష్ట్రాలకు, అమెరికా సంయుక్త రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇతర దేశాలకు ప్రయాణించినప్పుడు లేదా భవిష్యత్తులో ఎక్కడ పర్యటించినా, నివసించినా జార్జియా రాష్ట్రం తరఫున ఒక సౌహార్ద రాయబారిగా (Goodwill Ambassador) సకల మర్యాదలు, గౌరవాలు పొందుతారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా నరేందర్ జి. రెడ్డి అందించిన సేవలకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.
ఇక.. జార్జియా అవుట్ స్టాండింగ్ సిటిజన్ పురస్కారం అందుకోవడం తన జీవితంలో అత్యంత గర్వకారణమైన క్షణమని పురస్కార గ్రహీత నరేందర్ జి. రెడ్డి ప్రకటించారు. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్పెర్గర్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును అందుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. నిజంగా తాను ధన్యుడ్ని అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకు ఈ గౌరవాన్ని అందించిన జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్పెర్గర్కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.







