ఈ మహత్తర ఘట్టంలో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది : సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి వైభవం మాటల్లో చెప్పలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ (Vardhaman Jain) 121 కిలోల బంగారు ఆభరణాలను సీఎం చేతుల మీదుగా తిరుమల శ్రీవారికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎక్కడా దొరకని దివ్యానుభూతి తిరుమల (Tirumala)లో తొరుకుతుంది. రూ.206 కోట్ల విలువైన 121 కిలోల ఆభరణాలను భక్తుడు విరాళంగా ఇవ్వడం ఒక చరిత్ర. వీటిలో 106 కిలోలతో శ్రీవారికి ఆభరణాలు, 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారు చేశారు. ఈ మహత్తర ఘట్టంలో నేను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. భక్తి విశ్వాసంతో ముందుకొచ్చి ఆయన విరాళమిచ్చారు. తరాలు మారినా శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీవారి (Srivari) ఆభరణాల్లో పాదకవచాలు, కౌస్తుభం, నాగాభరణాలను వజ్రాలు, రత్నాలతో బ్రహ్మాండంగా డిజైన్ చేశారు అని అన్నారు.







