రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేత.. విజయంగా అభివర్ణించిన ట్రంప్..
రష్యా-అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.నిన్నటి వరకూ రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నించిన అమెరికా అధినేత ట్రంప్.. లేటెస్టుగా తన విధానం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేశారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. రష్యాతో కుదిరిన డీజిల్ సరఫరా ఒప్పందాన్ని ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు.
మరోవైపు దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యాతో ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి స్పష్టమైన, దీర్ఘకాలిక ఒప్పందం లేకుండా ఆంక్షలు సడలించడం బలహీనతకు నిదర్శమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల మాస్కోకు యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
శుక్రవారం పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్లో చర్చలు జరిపిన అనంతరం రష్యాపై ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా ట్రెజరీ విభాగం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు రష్యా నుంచి డీజిల్ కొనుగోలు, రవాణా, దిగుమతులకు పూర్తి అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు రష్యా తక్షణమే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయనుందని ట్రంప్ ప్రకటించారు. తక్షణమే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ ఇంధనాన్ని సరఫరా చేయడానికి రష్యా అంగీకరించిందని ఆయన తెలిపారు. నవంబర్ నెలలో మరో 5 లక్షల టన్నులు, ఆ వెంటనే మరో 10 లక్షల టన్నుల డీజిల్‌ను మాస్కో సరఫరా చేయనుందని వివరించారు.
అంతేకాకుండా అక్కడి రిఫైనరీల పరిస్థితి ఆధారంగా అతి తక్కువ కాలంలోనే ఏకంగా 30 లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు రష్యా అందజేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద, అత్యంత ముఖ్యమైన ప్రకటన అని ఆయన అభివర్ణించారు. రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై కఠినమైన ఆంక్షలు భారీ సుంకాలు విధించేలా ఇటీవల అమెరికా చట్టం రూపొందించిన నేపథ్యంలో స్వయంగా అమెరికాయే రష్యా నుంచి డీజిల్ తీసుకోవడం ఆసక్తికర పరిణామం
జెలెన్ స్కీ తీవ్ర అభ్యంతరం…
రష్యాపై ఒత్తిడి తగ్గించడం వల్ల శాంతి నెలకొనదని, పైగా ఉక్రెయిన్‌పై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందని జెలెన్స్కీ పేర్కొన్నారు. మాస్కోకు ప్రయోజనం చేకూర్చే చర్యలు తీసుకునే బదులు, యుద్ధాన్ని ముగించేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని అమెరికాకు సూచించారు. బలహీనతతో శాంతిని సాధించలేని జెలెన్స్కీ పేర్కొన్నారు.ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా మరింత బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించడంతో పాటు ఉక్రెయిన్ రక్షణకు మద్దతు కొనసాగించాలని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఉభయ పార్టీల ప్రతినిధి బృందం కీవ్‌లో పర్యటించడాన్ని ఆయన స్వాగతించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఏం చేయాలన్న ప్రశ్నకు బలమైన సమాధానం అవసరమని అన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపాదించిన లిండ్సే గ్రాహం బిల్లులోని ఆంక్షలను అమలు చేయాలని, రష్యాపై ఒత్తిడిని కొనసాగించాలని కోరారు.
ట్రంప్ నిర్ణయంపై యూఎస్ సెనేటర్ ఫైర్
రష్యాపై ఆంక్షల ఎత్తివేయడం, పుతిన్‌తో ఒప్పందం చేసుకోవడంపై యూఎస్ సెనేటర్లు తీవ్రంగా స్పందించారు. రష్యా ఒప్పందం అవమానకరం అంటూ విమర్శించారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేస్తున్న యుద్ధంలో మనల్ని భాగస్వాములను చేస్తుందని యూఎస్ సెనేటర్ బ్లూమెంతల్ తెలిపారు. రష్యాతో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు. అలాగే అమెరికన్ చమురు కంపెనీలను కూడా హెచ్చరించారు. ఇక భారత్, చైనా పరోక్షంగా విమర్శిస్తూ, మీ పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. వేరే చోట నుంచి చమురు కొనుగోలు చేయాలని హెచ్చరించారు.








