కెనడాలో ఖలిస్థాన్ రెఫరెండం యత్నాలపై భారత్ తీవ్ర ఆగ్రహం..
కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో నిషేధిత తీవ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) నిర్వహించతలపెట్టిన ఖలిస్థాన్ రెఫరెండంపై భారతదేశం తీవ్ర స్థాయిలో స్పందించింది. అక్టోబర్ 18న ఈ వేర్పాటువాద కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సమగ్రతకు భంగం కలిగించేలా సాగే ఎలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలనైనా తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
పన్నూన్ వివాదాస్పద వ్యాఖ్యలు…
ఈ వివాదాస్పద రెఫరెండం నేపథ్యంలో ఎస్ఎఫ్జే ఫౌండర్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో జరిగే రెఫరెండంలో ప్రవాస సిక్కులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, సిక్కు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేరుతో ప్రత్యేక ఖలిస్థాన్ సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చారు.
ఆయుధ శిక్షణ వీడియోలపై ఆందోళన
గత ఆగస్టు నెలలో ‘ఖల్సా వోక్స్’ విడుదల చేసిన ఒక నివేదిక కెనడాలో ఖలిస్థానీ శక్తుల కదలికలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో కొందరు సిక్కు వ్యక్తులు సెమీ-ఆటోమేటిక్ రైఫిళ్లతో ఆయుధ శిక్షణ పొందుతున్నట్లు చూపించే వీడియోలు బయటకు రావడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ నివేదిక పేర్కొంది. కెనడియన్ ఇంటెలిజెన్స్ సైతం ఖలిస్థానీ తీవ్రవాదులను జాతీయ భద్రతా సమస్యగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రెచ్చగొట్టే సందేశాలు , ఆయుధ ప్రదర్శనలు శాంతిభద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








