Donald Trump: ట్రంప్ పై విరుచుకుపడుతోన్న అమెరికన్ మీడియా..!
ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్దంలో అమెరికా తలదూర్చడంపట్ల అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారా..? ఈ విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతుందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా తక్కువ అంచనా వేసిందా? అన్న కోణంలో అమెరికాలో చర్చ జరుగుతోంది. ఇరాన్ తన ప్రధాన అస్త్రమైన హార్ముజ్ జలసంధిని(Strait of Hormuz) మూసివేసే విషయంలో.. ఆ దేశ సామర్థ్యాన్ని అమెరికా రక్షణ విభాగం (Pentagon) సరిగ్గా అంచనా వేయలేదని అమెరికన్ మీడియా పేర్కొంది.
దీనివల్ల ప్రపంచ చమురు ధరలు అమాంతం పెరిగి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారట. ఇరాన్ కేవలం క్షిపణులు, డ్రోన్లకే(Drone) పరిమితం కాకుండా, గెరిల్లా తరహా దాడులతో అమెరికా సేనలకు సవాలు విసురుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా తక్కువ వనరులతో ఇరాన్ ఎక్కువ ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై డొనాల్డ్ ట్రంప్ పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని అమెరికా మీడియా విమర్శిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఒకవైపు త్వరలోనే ముగుస్తుందని చెబుతూనే, మరోవైపు యుద్ధం కొనసాగుతుందని అనడం ఆయనలో ఉన్న అయోమయాన్ని సూచిస్తోందని అమెరికన్ మీడియా ఎద్దేవా చేస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా వద్ద ఉన్న క్షిపణి, ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు, ఇందుకోసం ఆయన రక్షణ రంగ సంస్థలతో అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్లు కూడా అక్కడి మీడియా చెప్తోంది. యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని, ఇంత భారీ వ్యయంపై స్వదేశంలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని కథనాలు వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న ఈ కథనాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ ఇప్పటికే ఓడిపోయిందని, మీడియా కేవలం ‘ఫేక్ న్యూస్'(Fake News) ప్రచారం చేస్తోందని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా కొట్టిపారేశారు. “నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ఆగుతుంది” అని చెబుతూనే, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, ఇరాన్ పరాక్రమం మరియు యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టం ట్రంప్ యంత్రాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయని అంతర్జాతీయ మీడియా గట్టిగా వాదిస్తోంది.
ఇవి కూడా చదవండి








