China: ప్రపంచానికి ఎరువుల సెగ.. ఎగుమతులపై చైనా ఆంక్షలతో భారత్‌కు తిప్పలు!
China: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారుల్లో ఒకటైన చైనా, తన దేశీయ అవసరాల దృష్ట్యా ఎరువులు , ఇంధన ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో యూరియా కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీలక పరిణామాలు:
ఇంధన ఎగుమతుల నిలిపివేత: అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం (ITC) గణాంకాల ప్రకారం.. జెట్ ఇంధనం, డీజిల్, కిరోసిన్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల విదేశీ రవాణాను నిలిపివేయాలని చైనా తన పరిశ్రమ వర్గాలను ఆదేశించింది.
ఎరువులపై ఆంక్షలు: మార్చి మధ్య నుంచే నైట్రోజన్, పొటాషియం మిశ్రమ ఎరువుల ఎగుమతులపై చైనా నిబంధనలు విధించింది. ఇప్పటికే యూరియా ఎగుమతులను పూర్తిగా నిషేధించిన బీజింగ్, కేవలం అమ్మోనియా సల్ఫేట్కు మాత్రమే మినహాయింపునిచ్చింది.
ఇవి కూడా చదవండి
భారత్‌పై ప్రభావం: భారత్‌కు ఎరువుల సరఫరాను నిలిపివేయాలని చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని తయారీ సంస్థలకు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.
దేశీయ కారణాలు: యుద్ధం కారణంగా ఇంధన , ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా చైనా ఈ రక్షణాతీక చర్యలు తీసుకుంటోంది.
భారత యూరియా కంపెనీల పరిస్థితి:
ఒకవైపు దిగుమతులు తగ్గడం, మరోవైపు యూరియా తయారీకి అవసరమైన ద్రవరూప సహజ వాయువు (LNG) సరఫరాలో అంతరాయం కలగడంతో భారత్‌లోని పలు యూరియా ప్లాంట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది సాగుపై ఆధారపడ్డ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇవి కూడా చదవండి








