పడిపోయిన భారత చమురు ఎగుమతులు.. దేశీయ రిఫైనరీలకు ఏమైంది?
ప్రపంచ చమురు మార్కెట్లో ఎప్పుడూ తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించే భారతదేశం, అనూహ్యంగా ఒక అడుగు వెనక్కి వేసింది. విదేశాలకు మనం విక్రయించే శుద్ధి చేసిన పెట్రోలియం (Refined Petroleum) ఉత్పత్తుల ఎగుమతులు (Oil Exports) మునుపెన్నడూ లేని విధంగా మే నెలలో ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రముఖ గ్లోబల్ కమోడిటీ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ (Kpler) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఇంధన ఎగుమతులు రోజుకు సగటున 9.3 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి. 2022 అక్టోబర్ తర్వాత మన ఎగుమతులు ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31 శాతం తక్కువ కావడం గమనార్హం.
అసలు బ్రేక్ పడింది అక్కడే!
మన దేశ ఎగుమతులు (Oil Exports) ఇలా అమాంతం పడిపోవడానికి ప్రధాన కారణం ముడి చమురు కొరత కాదు.. మన భారీ రిఫైనరీల్లో జరుగుతున్న మరమ్మతులే. దేశంలోని పలు కీలక చమురు శుద్ధి కర్మాగారాల్లో ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం భారీ స్థాయిలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్’.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం. ప్రస్తుతం అక్కడ కీలకమైన నిర్వహణ పనులు సాగుతుండటంతో, చమురు శుద్ధి సామర్థ్యం తాత్కాలికంగా మందగించింది. దీనివల్ల విదేశీ మార్కెట్లకు ఎగుమతి (Oil Exports) చేయడానికి తగినంత ఇంధన నిల్వలు లేకుండా పోయాయి.
గ్యాస్‌కే కంపెనీల మొదటి ఓటు
విదేశీ ఎగుమతుల తగ్గుదలకు దేశీయంగా పెరిగిన వంటగ్యాస్ (ఎల్పీజీ) డిమాండ్ కూడా ఒక బలమైన కారణం. ఇటీవల కాలంలో మనదేశంలో ఎల్పీజీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డిమాండ్‌ను ఎప్పటికప్పుడు తీర్చడానికి చమురు కంపెనీలు తమ ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం కోసం.. ఏకంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిని రోజుకు దాదాపు 80,000 బ్యారెళ్ల మేర తగ్గించేశాయి. ఆ సామర్థ్యాన్నంతా గ్యాస్ ఉత్పత్తి వైపు వ్యూహాత్మకంగా మళ్లించాయి. దీనికి తోడు, దేశీయ ఇంధన భద్రతకే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (PSUs) పెద్దపీట వేశాయి. విదేశాల్లో (Oil Exports) వచ్చే లాభాల కంటే ముందు మన దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే ముఖ్యమని భావించి, ఉత్పత్తిలో సింహభాగాన్ని స్థానిక మార్కెట్‌కే సరఫరా చేశాయి.
లాభాలు లేక.. పన్నుల భారంతో..
వీటన్నింటికి తోడు ఆర్థికపరమైన సమీకరణాలు కూడా ఎగుమతి దారులను వెనక్కి లాగాయి. విదేశీ మార్కెట్లలో మునుపటిలా లాభాల మార్జిన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. మరోవైపు ప్రభుత్వం ఎగుమతులపై (Oil Exports) విధిస్తున్న పన్నుల భారం కారణంగా కంపెనీలు విదేశీ కస్టమర్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. మొత్తానికి ఒకవైపు మన సొంత గ్యాస్ అవసరాలు, మరోవైపు దేశీయ రిఫైనరీల నిర్వహణ పనులు.. వెరసి భారత చమురు ఎగుమతుల గ్రాఫ్‌ను అమాంతం కిందకు లాగేశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








