Driving License: తెలంగాణలో కొత్త ‘రోడ్ సేఫ్టీ’ టెస్ట్.. లైసెన్స్ ప్రక్రియలో ఈ పరీక్షలు మస్ట్!
Driving License: తెలంగాణ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, లైసెన్స్ జారీ ప్రక్రియలో అదనంగా మరో పరీక్షను చేర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ఏప్రిల్ 1, 2026 నుండి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏమిటా కొత్త పరీక్ష?
ఇప్పటివరకు లర్నర్స్ లైసెన్స్ (LLR) , డ్రైవింగ్ టెస్ట్ అనే రెండు దశలు మాత్రమే ఉండేవి. అయితే ఇకపై ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు ‘ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్’ (Online Road Safety Awareness Modules) టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో పాస్ అయి సర్టిఫికేట్ పొందితేనే ఎల్ఎల్ఆర్ దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
పరీక్ష విధానం ఇలా:
ఈ కొత్త టెస్ట్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు తమ ఇంటి నుండే లేదా డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా ఈ పరీక్షకు హాజరుకావచ్చు.
- సమయం: మొత్తం 3 గంటల వ్యవధి.
- మాడ్యూళ్లు: ఇందులో మొత్తం 6 మాడ్యూళ్లు ఉంటాయి, ఒక్కో దానికి 30 నిమిషాల సమయం కేటాయించారు.
- కంటెంట్: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేలా ప్రశ్నలు ఉంటాయి.
ప్రమాదాల నివారణే లక్ష్యం:
కేవలం వాహనం నడపడం వస్తే సరిపోదని, రోడ్డు క్రమశిక్షణపై పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ నిబంధన అమల్లోకి రానుండటంతో, కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారు ఈ అదనపు పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది.








