TRS: ‘టీఆర్ఎస్’ గేట్లు మూసేసిన కవిత!?
తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాల పాటు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి- TRS పేరు ఇప్పుడు తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ తన రాజకీయ విస్తరణ కాంక్షతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చిన తర్వాత ఎదురైన వరుస పరాజయాలు ఒకవైపు పార్టీని కుదిపేస్తున్నాయి. ఇప్పుడు కూతురు కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
2001లో ప్రారంభమైన టీఆర్ఎస్, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేసిన పేరు మార్పు నిర్ణయం బెడిసికొట్టిందని పార్టీ కేడర్ మొదటి నుంచీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆపై లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో, బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతోందనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మళ్లీ టీఆర్ఎస్ పేరును తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని హింట్ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన-TRS అని పేరు పెట్టడం కేసీఆర్ వ్యూహాలకు గండి కొట్టినట్లయింది.
బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ పాత పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎదురుచూస్తున్న వేళ, కవిత అదే అక్షరాలతో కొత్త పార్టీని తీసుకురావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టీఆర్ఎస్ పేరుపై ఉన్న ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడం కవిత ఉద్దేశంగా కనిపిస్తోంది. తెలంగాణ పేరునే తొలగించి టీఆర్ఎస్ ను గాలికొదిలేశారని.. అసలైన టీఆర్ఎస్ వారసులం తామేనని చెప్పుకోవడానికి ఈ పేరు కవితకు ఒక అస్త్రంగా మారుతుంది.
కవిత ప్రకటనతో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ డిఫెన్స్ లో పడ్డారని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో దాదాపు అదే పేరుతో మరో పార్టీ రావడం కాస్త ఇబ్బంది కలిగించే పరిణామమే. తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ రాష్ట్ర సేనకు తేడా ఉంది. పూర్తి పేరును చూస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ అభ్యంతరం పెట్టకపోవచ్చు. అయితే సంక్షిప్త రూపంలో చూసినప్పుడే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీనిపై న్యాయ పోరాటం చేస్తారా.. లేదా.. అనేది ప్రస్తుతానికి తెలీదు. అంతేకాక, కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ నుంచి నో అబ్జెక్షన్ వచ్చిందా.. లేదా.. అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. పేరు మార్చకపోతే తెలంగాణ సెంటిమెంట్‌ను కవిత పార్టీ హైజాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పేరు మార్చాలని ప్రయత్నిస్తే, కవిత పార్టీ పేరుతో అది క్లాష్ అవుతుంది. సొంత బిడ్డనే ఇలాంటి షాక్ ఇస్తుందని గులాబీ బాస్ ఊహించి ఉండరు. ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్నే కొనసాగిస్తారా? లేక ఏదైనా మధ్యేమార్గం వెతుకుతారా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా, టీఆర్ఎస్ పేరు చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.








