బీఆర్ఎస్ను కంబైన్డ్‌గా కార్నర్ చేసిన కాంగ్రెస్, బీజేపీ
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఒక స్పష్టమైన మార్పు గమనించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ విమర్శల పంథాను పూర్తిగా మార్చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న బీఆర్ఎస్, దాని అధినేత కేసీఆర్‌లను టార్గెట్ గా చేసుకుని ఆయన విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడాయన రూట్ మార్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎక్కడ బహిరంగ సభ జరిగినా కిషన్ రెడ్డి లక్ష్యంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. “ఈ నెల 15వ తేదీ తర్వాత కిషన్ రెడ్డి సంగతి చూస్తాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన తాజా సవాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను కాదని, కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారనేదానిపై ఆరా తీస్తే.. దీని వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నట్టు అర్థమవుతోంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను పూర్తిగా నిస్తేజం చేసి మూడో స్థానానికి పరిమితం చేయడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ప్రధాన పోటీ కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా, రాబోయే ఎన్నికల నాటికి ద్విముఖ పోరు జరిగేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్, ఓటు బ్యాంక్ బలహీనపడింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ను ఇంకా టార్గెట్ చేయడం వల్ల ఆ పార్టీకి అనవసర మైలేజ్ ఇచ్చినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
క్షేత్రస్థాయిలో బలపడుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీని ప్రధాన శత్రువుగా చూపించడం వెనుక పెద్ద ఓటు బ్యాంక్ వ్యూహం ఉంది. రాష్ట్రంలో బీజేపీని వీలైనంతగా టార్గెట్ చేయడం ద్వారా యాంటీ బీజేపీ ఓట్లన్నీ ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లు చీలిపోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు ఏకీకృతం అవుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్లలో బీఆర్ఎస్పై నమ్మకం తగ్గితే, ఆ ఓట్లు కాంగ్రెస్‌కే పడాలంటే బీజేపీని పెద్ద శత్రువుగా చూపించడం రేవంత్‌కు అత్యంత అవసరం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. మోదీ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే కిషన్ రెడ్డి, తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం వెనుక ప్రాంతీయ సెంటిమెంట్‌ను రచ్చకెక్కించే వ్యూహం ఉంది. చేవెళ్ల, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా బీజేపీ నేతలే ఉన్నా.. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తేవడంలో వారు విఫలమయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, బీజేపీని బలహీనపరచాలని రేవంత్ చూస్తున్నారు.
దీనికి కౌంటర్‌గా బీజేపీ సైతం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడానికే మొగ్గు చూపుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలను, కేంద్ర పెద్దలతో ఆయన జరిపే భేటీలను కిషన్ రెడ్డి క్షుణ్ణంగా గమనిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కూడా బీఆర్ఎస్ను పక్కన పెట్టి, కేవలం కాంగ్రెస్ వైఫల్యాలనే ఎండగట్టడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తి అని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంటే, ఉభయ పక్షాలు పరస్పరం లబ్ధి పొందేలా, బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా తుడిచిపెట్టేలా ఈ ద్విముఖ పోరు వ్యూహానికి ఇరు పార్టీలూ సహకరించుకుంటున్నాయనే భావన వ్యక్తమవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త రాజకీయ వ్యూహం తెలంగాణను భవిష్యత్తులో కేవలం రెండు జాతీయ పార్టీల రణరంగంగా మార్చబోతోంది. రాబోయే 24 నెలల కాలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెబుతూనే, రాజకీయంగా ప్రత్యర్థులను కోలుకోకుండా చేయడం రేవంత్ మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం.








