అభివృద్ధిని అడ్డుకోవడం సైకోయిజమే.. జగన్పై లోకేశ్ ఫైర్!
Nara Lokesh: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. జగన్ అనుసరిస్తున్న విధానాలు రాక్షస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సొంత కుటుంబ సభ్యులనే దూరం చేసుకున్న వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఎద్దేవా చేశారు.
ఉద్యోగ అవకాశాలను అడ్డుకోవాలని..
రాష్ట్రానికి అధునాతన బోట్ల తయారీ కంపెనీ రావడం వల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అయితే అటువంటి కంపెనీని కూడా తరిమేస్తామని అనడం జగన్ సైకోయిజానికి పరాకాష్ట అని లోకేశ్ దుయ్యబట్టారు. వెయ్యికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంటే, దానిని అడ్డుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
దుర్మార్గమైన ఆలోచన..
అమరావతిని మార్చేస్తామని, అక్కడ నిర్మించిన కట్టడాలను కూల్చేస్తామని చెప్పడం దుర్మార్గమైన ఆలోచన అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను అడ్డుకోవడమే పనిగా జగన్ పెట్టుకున్నారని విమర్శించారు. “నరుకుతాం.. కూల్చేస్తాం” అనే భాష వాడటం జగన్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని ఎక్స్ (X) వేదికగా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.








