శాంతి ప్రణాళికపై అమెరికా-ఇరాన్ చర్చలు ..!
పశ్చిమాసియా మారణహోమాన్ని ఆపేందుకు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి చర్చలు ఇవే.ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ చర్చలకు ముందు ఆయన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు. పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సహా ఇరాన్ అధికారులు కూడా షరీఫ్ తో సమావేశమయ్యారు.
ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలు జరిపితే వాషింగ్టన్ “స్వేచ్ఛగా చేయి చాచడానికి” సిద్ధంగా ఉందని వాన్స్ చర్చలకు ముందు స్పష్టం చేశారు. చర్చలు సరిగ్గా జరగకుంటే.. తాము మరోసారి దాడులు చేయడానికి సిద్ధంగాఉన్నామని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు కూడా . మరోవైపు.. ఈ చర్చల లక్ష్యం… తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న అక్రమ యుద్ధాన్ని అంతం చేయడం కోసమేనని ఇరాన్ ప్రతినిధులు తెలిపారు.
“ఈ యుద్ధం ఇరాన్ జాతికి, నాగరికతకు వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన నేరం మాత్రమే కాదు, ఇది ప్రాంతం మరియు ప్రపంచ భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది,” అని ఇరాన్ నేత మొఘాదం పోస్ట్ చేశారు. ఆతిథ్యదేశం పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను అమెరికా గౌరవిస్తుందో లేదో చూడాల్సి ఉందన్నారు ఇరాన్ ప్రతినిధులు. మరోవైపు, ఆరు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మార్గం సుగమం చేశామని పాకిస్థాన్ చెబుతోంది.








