Dalai Lama: బౌద్ధగురు దలైలామాకు గ్రామీ అవార్డ్.. చైనా తీవ్ర ఆగ్రహం..!
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి. లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. దలైలామాకు అవార్డు దక్కడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
దలైలామా తరఫున గాయకుడు రఫూస్ వెయిన్‌రైట్ అవార్డును స్వీకరించారు. ‘ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్’ కేటగిరీలో ఈ అవార్డు దక్కింది. గాయకులు మ్యాగీ రోజర్స్, ఆండ్రా డేతో కలిసి దలైలామా ఈ ఆల్బమ్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. కబీర్ సెహగల్ నిర్మించిన ఈ ఆల్బమ్‌లో సరోద్ విద్వాంసుడు అంజాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, అమెరికా శాక్సాఫోన్ విద్వాంసుడు టెడ్ నాష్, గాయకుడు, గేయ రచయిత డెబీ నోవా తదితరులు కనిపించారు.
అవార్డును తాను వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని, దానిని కృతజ్ఞతతో, మానవత్వంతో స్వీకరిస్తున్నానని, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న బాధ్యతలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని దలైలామా తెలిపారు.
దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా తప్పుబట్టింది. తమ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయనకు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. మతం పేరుతో ఆయన విభజన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. ‘ఆయనో రాజకీయ శరణార్థి. మతం పేరుతో చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.






