కార్యకర్తే సుప్రీం, సామాన్య కార్యకర్తకు చంద్రబాబు గిఫ్ట్ పై ఆసక్తికర చర్చ..!
తెలుగుదేశం(TDP) పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు దక్కుతుందని సిఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన గంట్యాడ శ్రీదేవిని పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మండల పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న మహిళా నేతను నేరుగా పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం టీడీపీ చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం.
సాధారణంగా పొలిట్‌బ్యూరో సభ్యత్వం అంటే మాజీ మంత్రులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లకు మాత్రమే దక్కే గౌరవం. కానీ, గజపతినగరం మండల అధ్యక్షురాలిగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రీదేవిని ఈ పదవికి ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు ఒక బలమైన సందేశాన్ని పంపారనే కామెంట్స్ వినపడుతున్నాయి. పదవులు కేవలం హేమాహేమీలకే కాదు, పార్టీ జెండా మోసే నిబద్ధత కలిగిన కార్యకర్తలకు కూడా దక్కుతాయని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమైందనే మాట వినపడుతోంది.
కేవలం వేదికల మీద మహిళా సాధికారత గురించి మాట్లాడటమే కాకుండా, చేతల్లో కూడా చూపిస్తామని టీడీపీ నిరూపించుకుందని ఆ పార్టీ ఒక మండల స్థాయి మహిళా నాయకురాలు నేరుగా పార్టీ విధానాలను నిర్ణయించే అత్యున్నత స్థాయికి చేరడం అనేది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళా కార్యకర్తలకు కొండంత స్ఫూర్తినిస్తోంది. గజపతి నగరం(GajapathiNagaram) మండలంలో పార్టీ బలోపేతం కోసం ఆమె చేసిన కృషిని అధిష్టానం గుర్తించడం విశేషం. వారసత్వ రాజకీయాలకు తావులేకుండా, కిందిస్థాయి నుంచి వచ్చిన నాయకులకు గుర్తింపునివ్వడంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ తనదైన శైలిని చాటుకున్నారు. ఈ నియామకంతో గజపతినగరం నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. నిబద్ధతతో పనిచేస్తే పార్టీ ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని చెప్పడానికి గంట్యాడ శ్రీదేవి గారి నియామకమే ఒక తిరుగులేని ఉదాహరణ.
ఇవి కూడా చదవండి







