Retail Inflation: ఫిబ్రవరిలో 3.21 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం!
దేశంలో సామాన్యుడిపై ధరల భారం స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 3.21 శాతానికి ఎగబాకింది. జాతీయ గణాంక కార్యాలయం (NSO) గురువారం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జనవరిలో 2.75 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నెల రోజుల వ్యవధిలో 47 బేసిస్ పాయింట్లు పెరిగింది. కేంద్రం కొత్తగా పరిగణనలోకి తీసుకున్న ‘2024 బేస్ ఇయర్ (ఆధారిత సంవత్సరం)’ సిరీస్ లెక్కల ప్రకారం ఈ ద్రవ్యోల్బణాన్ని మదింపు చేశారు.
ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలు..
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్ డిమాండ్ కలగలిపి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని (Retail Inflation) పైకి నెట్టాయి. ముఖ్యంగా పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో ఏర్పడిన అంతరాయాలు, తద్వారా ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ పుంజుకోవడం ప్రధాన కారణం. దీనికి తోడు నిత్యావసరాలైన కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరిగాయి. మరోవైపు బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల కూడా ద్రవ్యోల్బణం (Retail Inflation) పైకి వెళ్లడానికి గట్టిగా దోహదపడింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పల్లెల కంటే నగరాల్లోనే ఎక్కువ..
ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో.. ఫిబ్రవరిలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ (ఆహార ద్రవ్యోల్బణం) 3.75 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లోనే ధరల ఒత్తిడి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. డేటా ప్రకారం ఫిబ్రవరిలో గ్రామీణ ద్రవ్యోల్బణం 3.07 శాతంగా నమోదైతే, పట్టణ ద్రవ్యోల్బణం 3.32 శాతంగా రికార్డయ్యింది.
ఆర్బీఐ లక్ష్యానికి లోబడే..
రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) సూచీ స్వల్పంగా పైకి కదిలినప్పటికీ, ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థకు ఇది ఆందోళన కలిగించే స్థాయి అయితే కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించుకున్న 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యం కంటే ఈ రేటు ఇంకా దిగువనే స్థిరంగా కొనసాగుతుండటం సానుకూలాంశం.
ఇవి కూడా చదవండి








